తెలంగాణలో రాజ్యసభ సీట్ల ఎంపికలో కేసీఆర్ ఈ సారి తన పాత మిత్రులకు చాన్సిచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్‌గా ఉన్న మండవ వెంకటేశ్వరరావు గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ నుంచి కవిత గెలుపులో సవాళ్లు ఎదుర్కొంటూడటంతో ఆయనను కేసీఆర్ ప్రత్యేకంగా పార్టీలో చేర్చుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కవిత ఓడిపోయారు.
ఆ తర్వాత మండవకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. పదవులు ఇవ్వలేదని మండవ కూడా పట్టించుకోలేదు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల పరిస్థితి, అవసరాల దృష్ట్యా రాజ్యసభ పదవికి ప్రధానంగా మండవ పేరు వినిపిస్తుండటంతో ఆయనకు చాన్స్ దక్కే ఆవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. సామాజిక సమీకరణాలు కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ప్రదాన సామాజికవర్గం మద్దతును కూడగట్టుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒకదానికి రెండేళ్లు మాత్రమే కాలపరిమితి ఉంది. దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆఫర్ చేశారు. కానీ ఆయన తిరస్కరించారు. మరో రెండు స్థానాలు ఎవరికి ఇస్తారన్నదానిపై క్లారిటీ లేదు.