తెలంగాణా అవతరణ దినోత్సవాన రాష్ట్ర విభజన గురించి చాలా చాలా విమర్శలు చేశాడు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మెప్పు కోసం తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు చంద్రబాబు. అయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా తెలంగాణా వాదులను బాధించేవే. ఒక వేళ తెలంగాణా ప్రజలు బాధపడకపోయినా చంద్రబాబు మాటలను ఉపయోగించుకుని తెలంగాణా సెంటిమెంట్‌ని రగిలించే అవకాశాన్ని మాత్రం తెలంగాణా నేతలకు ఇచ్చాయి. అయితే అవకాశాన్ని ఉపయోగించుకున్నది మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. కెసీఆర్, హరీష్‌రావు, కెటీఆర్లతో పాటు ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. పనిలోపనిగా టీటీడిపి నేతలను కూడా ఎంతలా కార్నర్ చేయాలో అంతా చేశారు.
తెలంగాణాలో అస్థిత్వం లేని వైకాపాను పక్కనపెడితే మిగతా పార్టీల నేతలందరూ కూడా బ్లాక్ డే అన్న చంద్రబాబు మాటలను ఎందుకు ఖండించలేదు అన్నది చాలా పెద్ద ప్రశ్న. మరీ టీఆర్ఎస్ స్థాయిలో విరుచుకుపడకపోయినా కనీసం ఎందుకు స్పందించలేకపోయారు? ఎందుకంటే మిగతా అన్ని పార్టీలది కూడా రెండు రాష్ట్రాల సిద్ధాంతమే కాబట్టి. పూర్తిగా ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం అవ్వలేని పరిస్థితి. చంద్రబాబు కూడా అందుకే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే అర్థమయ్యేలా రాష్ట్ర విభజనపై చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలను పట్టుకుని టీఆర్ఎస్ నేతలు అయితే తెలంగాణాలో ఎంత మైలేజ్ తెచ్చుకోవాలో అంతా తెచ్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చంద్రబాబు చేస్తున్న తప్పులు, అలాగే విభజన గురించి చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు తెలంగాణాలో టిడిపికి నష్టం చేస్తున్నాయని ఇప్పటికే టిటిడిపి నేతలు అంతర్గతంగా చాలా సార్లు వాపోయారు. ఇక కాంగ్రెస్, బిజెపిలతో సహా అన్ని పార్టీల నేతలకూ రెండు రాష్ట్రాల ప్రజల ఓటర్లూ కావాలి కాబట్టి మౌనవ్రతం పాటిస్తూ ఉంటారు. అందుకే తెలంగాణా ప్రజల దృష్టిలో కెసీఆర్ హీరో అవుతున్నాడు. తెలంగాణా ఉద్యమ సమయం నుంచీ కూడా కెసీఆర్ ప్రధాన ఆయుధం అదే. ఇక 2019లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు రావడం ఖాయం. అప్పుడు కూడా మిగతా పార్టీలన్నీ కూడా ఇరు రాష్ట్రాల ప్రజలనూ మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ బేలన్స్ చేస్తూ ఉంటాయి. కానీ కెసీఆర్ మాత్రం తెలంగాణా ప్రజల కోసం మాత్రమే ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే అన్న సందేశాన్ని తెలంగాణా ప్రజలు గట్టిగా గుర్తుంచుకునేలా చేస్తూ ఉంటాడు. ఇక తెలంగాణాలో ఉన్న ఇతర పార్టీలకు కెసీఆర్‌ని సమర్థంగా ఎదుర్కునే అవకాశం ఎక్కడ ఉంటుంది.