ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అంతా ఆయనకు తెలుసుని ఈడీ కోర్టులో వాదించిందంటూ ఒక్క సారిగా ప్రచారం జరగడం సంచలనం రేపింది. కేసీఆర్ తాను అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర పెద్దల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని… బీఎల్ సంతోష్ అరెస్టుకు ప్రత్యేక విమానంలో పోలీసుల్ని పంపారని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజునే ఇలాంటి ప్రచారం జరగడంతో ఏదో ఉందని అంతా అనుకున్నారు.
గతంలో బీఎల్ సంతోష్ తనపై కుట్ర చేసిన వారిని వదిలేది లేదని అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. ఆ ప్రకారం..కేసీఆర్ ను అంత తేలికగా వదిలి పెట్టరని.. లిక్కర్ కేసులోనే ఆయననూ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అనుకున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల విషయంలో మీడియాలో జరిగిన ప్రచారాన్ని తర్వాత కవిత తరపు లాయర్ మోహిత్ రావు ఖండించారు. అసలు కేసీఆర్ ప్రస్తావనే రాలేదన్నారు.
మోహిత్ రావు అసలు కేసీఆర్ ప్రస్తావన రాలేదని.. మాగుంట కుటుంబం ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు. అయితే జరిగింది కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు కాబట్టి మాగుంట ప్రస్తావన ఎందుకు వస్తుందన్న సందేహాలూ ఉన్నాయి. కేసీఆర్ ప్రస్తావన రాలేదని కవిత లాయర్ చెబుతున్నప్పటికీ… వంద శాతం విశ్వసించలేమని… ఈడీ ఖచ్చితంగా కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
కవితకు బెయిల్ ఇచ్చే విషయంలో ఈడీ తీవ్రంగా వ్యతిరేకంగా వ్యతిరేకిస్తోంది. తీవ్రమైన అభియోగాలే చెబుతోంది. రేపోమాపో చార్జిషీటు కూడా వేస్తామని అంటోంది. అందుకే కవితకు బెయిల్ రావడం కష్టమన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతోంది.