ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నిమగ్నమయ్యారు. ముందుగా, కేరళ వెళ్లి సీఎం పినరయి విజయన్ ను కలిసొచ్చారు. ఆ తరువాత, తమిళనాడులో స్టాలిన్ తో భేటీ కుదరలేదు. కర్ణాటక సీఎం కుమార స్వామితో కూడా భేటీ వాయిదా పడినట్టే అంటున్నారు. కొన్ని నెలల కిందట ఇలానే పర్యటనకు బయలుదేరిన కేసీఆర్… మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లను కలుసుకున్నారు. అప్పుడు కూడా మాయావతితో భేటీ సాధ్యం కాదులేదు. ఆ సందర్భంలోనే అఖిలేష్ యాదవ్ ఓసారి హైదరాబాద్ వచ్చి వెళ్లారు. అప్పుడుగానీ, ఇప్పుడుగానీ… కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడినట్టుగా కనిపించాయి. మరో అడుగు వెనక్కి పడ్డట్టుగానూ ఉంటున్నాయి. ఇంతకీ, కేసీఆర్ ప్రయత్నంలో లోపమెక్కడుంది..?
ప్రధానమైన లోపం… కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న పక్షాల చుట్టూ తిరుగుతూ ఉండటమే! ఫెడరల్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ తెర మీదికి వచ్చిన దగ్గర్నుంచీ చూసుకుంటే… కాంగ్రెసేతర భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటు చేద్దామంటూ కేసీఆర్ చక్కర్లు కొడుతున్నది కేవలం కాంగ్రెస్ మద్దతుదారులు చుట్టూనే. భాజపా భాగస్వామ్య పక్షాలైన అకాలీదళ్ గానీ, శివసేన గానీ, జేడీయూ నితీష్ కుమార్ లాంటి వారి దగ్గరకి ఆయన వెళ్లింది లేదు. భాజపాకి దగ్గరగా ఉన్న పార్టీల దగ్గరకి వెళ్లి… భాజపాయేతర కాంగ్రెసేతర ఫ్రెంట్ ఏర్పాటు చేద్దామని వారినీ కోరి ఉంటే కొంత బాగుండేది. దీంతో, కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ భాజపాకి అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయం ఏర్పడింది. భాజపా అనుకూలవాదిగానే కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అనే ఇమేజ్ జాతీయస్థాయిలో కొంతమేర వచ్చేసింది! దీన్నుంచి బయటకి వచ్చే ప్రయత్నం చేస్తే… ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నానికి స్పష్టమైన మద్దతు వచ్చి ఉండేదేమో.
అందుకే, ఇప్పుడు స్టాలిన్ మీటింగ్ వాయిదా పడిందని అనుకోవచ్చు. యు.పి.ఎ.లో స్టాలిన్ భాగస్వామి. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ప్రకటించిందే ఆయన. కాబట్టే కేసీఆర్ తో భేటీ అనగానే… వాయిదా వేసినట్టుగా కనిపిస్తోంది. కర్ణాటక సీఎం కుమారస్వామి పరిస్థితి కూడా అంతే. అక్కడ కాంగ్రెస్ మద్దతుతోనే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెసేతరం అంటూ వస్తుంటే… రండి మాట్లాడుకుందాం అని పిలిచే పరిస్థితిలో ఆయనా లేరు. పోనీ, కాంగ్రెస్ కీ భాజపాకీ సమాన దూరంలో ఉందామనే ప్రయత్నిస్తున్న మమతా, మాయవతి, అఖిలేష్ లను దగ్గర చేసుకుందామన్నా… ప్రో భాజపా ఇమేజ్ కొంత అడ్డంకిగా వారికి కనిపిస్తూ ఉండొచ్చు. కేసీఆర్ ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రెంట్ ముందుకు సాగకపోవడానికి ఇదే బలమైన కారణంగా కనిపిస్తోంది.