తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ ఎక్కువగా ఉందని.. అందులో తమ పార్టీని చొప్పించేయాలనుకునే నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. షర్మిల, ప్రవీణ్ కుమార్ వంటి వారే కాదు.. కొత్తగా పంజాబ్లో గెలిచిన ఆమ్ ఆద్మీ కూడా తెలంగాణపై కన్నేసింది. దక్షిణాదిలో పార్టీని విస్తరించుకోడానికి తెలంగాణలో అడుగు పెట్టాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మద్దతు ఆప్ కు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సోమనాథ్ భారతి అనే ఆప్ సీనియర్ నేత దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయన ఇప్పటికే పలువురు మాజీ బ్యూరో క్రాట్లను కలిసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి ఉంది. ఈ కారణంగా కేజ్రీవాల్ తెలంగాణపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
నిజానికి తెలంగాణలో ఆప్ లాంటి పార్టీలకు హైదరాబాద్లో మాత్రమే కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అసలు ఆప్ గురించి ఎవరికీ అవగాహన కూడా ఉండదు. పూర్తి స్థాయిలో లోకలైజేషన్ ఉన్న.. స్థానిక నినాదం పాతుకుపోయిన తెలంగాణలో .. హర్యానాకు చెందిన కేజ్రీవాల్ పెట్టి నఆమ్ ఆద్మీ నిలబడటం దాదాపుగా అసాధ్యమే. అయితే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఉన్న ఆమ్ ఆద్మీ… ఇక్కడ కొంత పోరాడుతున్న కాంగ్రెస్కు ఝులక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ రెడీ అవుతున్నారని అనుకోవచ్చు.