విజయవాడ ఎంపీ కేశినేని నాని తనకు తాను స్ట్రెయిట్ ఫార్వార్డ్నని.. ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని చెప్పుకుంటూ… సొంత పార్టీలోనే రచ్చ సృష్టిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపుగా.. తిరుగుబాటు చేసినంత పని చేసిన ఆయన.. తర్వాత… పార్టీలో తనకు నచ్చని కొంత మందిని టార్గెట్ చేశారు. మొదటగా.. గల్లా జయదేవ్ కుటుంబాన్ని.. ఆ తర్వాత దేవినేని ఉమను టార్గెట్ చేశారు. ఈ ఆదివారం ఉదయం ఫ్రెష్‌గా… హఠాత్తుగా ” నాలుగు ముక్కలు మాట్లాడటం.. చదవడం రాని వాళ్లు .. ట్వీట్ చేస్తున్నారు..” దౌర్భాగ్యం అనేసి.. ట్వీట్ చేశారు. నాని ట్వీట్ ఒక్క సారిగా కలకలం రేపింది. అది సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చేసిందేనని క్లారిటీ రావడంతో.. మొదట్లో … ఎవరినన్నారా.. అని ఉత్కంఠకు గురయ్యారు. కాసేపటికి టీడీపీ నేతలకు క్లారిటీ వచ్చింది.
కొద్ది రోజులుగా… విజయవాడ నగరంలో బుద్దా వెంకన్నతో.. కేశినేని నానికి ఆధిపత్య పోరాటం నడుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి.. వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరా పోటీ చేస్తాడని.. కేశినేని నాని సొంత పెత్తనంగా ప్రకటించారు. అలా ప్రకటించడానికి కేశినేని ఎవరని.. బుద్దా వెంకన్న ఫైరయిపోయారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్నుంచి కేశినేని నాని బుద్దా వెంకన్నపై దృష్టి పెట్టారు. అదే సమయంలో.. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లకు.. ట్వీట్లతోనే బుద్దా వెంకన్న సమాధానం చెబుతున్నారు. తాను కూడా ట్వీట్లు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. కేశినేని బుద్దా వెంకన్న కూడా ట్వీట్లు చేసేస్తున్నారంటూ సెటైర్లు వేశారు.
అయితే.. బుద్దా వెంకన్న ఊరుకోలేదు. మళ్లీ కౌంటర్ ఇచ్చారు. సంక్షోభ సమయంలో ఇతర పార్టీలతో కలిసి టీడీపీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే అర్థంలో విమర్శలు గుప్పించారు. కొద్ది రోజుల నుంచి.. కేశినేని నాని సోషల్ మీడియాలో అలజడి రేపుతున్నారు. ఆయన వైసీపీపైన కూడా విమర్శలు చేస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతగా.. చేస్తున్నారు కాబట్టి వాటికి ఆయనకు వస్తున్న ప్రచారం తక్కువే. కానీ సొంత పార్టీపై చేస్తున్న విమర్శలకు మాత్రం బోలెడంత క్రేజ్ వస్తోంది. ఎక్కువగా ఆయన అలాంటి ట్వీట్లే పెడుతున్నారు. పార్టీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే.. పార్టీలో చూసుకోవాలని కానీ.. ఇలా రోడ్డెక్కడం ఏమిటన్న చర్చ టీడీపీలో నడుస్తోంది.