అవును కోదండాస్త్రం మళ్లీ పదునెక్కుతోంది. తెలంగాణరాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ ఒకవైపు రాజకీయ పోరాటం చేస్తోంటే.. మరోవైపు కేసీఆర్‌తో సమానంగా ప్రజల్ని , వివిధ ఉద్యోగ వృత్తి వ్యాపార వర్గాలను ఒక్కటి చేసి, వారిని చైతన్య పరచిన జేఏసీ రథసారధిగా పోరాటానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాం.. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనకోసం మళ్లీ యాక్టివేట్ అవుతున్నారు. రాజకీయ భావజాలాలతో నిమిత్తం లేకుండా ప్రజలు, వారి అభివృద్ధి అనేది మాత్రమే ఎజెండాగా మళ్లీ టీజేఏసీ కార్యకలాపాలను ట్రాక్ ఎక్కించడం జరుగుతోంది. ఈసారి జేఏసీలో రాజకీయ పార్టీలకు చోటు ఉండదని స్పష్టంగా తేల్చేయడం ద్వారా… కోదండరాం ప్రస్తుత ఎజెండా ఎలా ఉండబోతున్నదో తెగేసి చెప్పేసినట్లు అయింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ఎక్కడైనా ఒంటెత్తు పోకడలను అనుసరిస్తూ ఉంటే గనుక.. వాటిని ఎండగట్టడంలో ప్రతిపక్షాలూ పూర్తిగా విఫలం అవుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం మళ్లీ ఉద్యమపంథాలోకి రావడం మంచి సూచికగనే భావించాల్సి ఉంటుంది.
ప్రతిపక్షాల వైఫల్యం అనేది తెలంగాణలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెలరేగుతుండడానికి ఒక కారణంగా తయారైంది. అయితే ప్రజల్లో విశ్వసనీయత కూడా కలిగి ఉండి… ప్రభుత్వాన్ని నిలదీసే పాత్రను ఎవ్వరూ పోషించడం లేదు. విపక్షం పోషించాల్సిన పాత్ర పరంగా తెలంగాణలో శూన్యత ఏర్పడి ఉన్నది. అంతోఇంతో కాంగ్రెస్, తెదేపా నాయకులు గొంతు చించుకుంటున్నారు గానీ.. వారికి ప్రజల్లో విశ్వసనీయత గౌరవం లేకుండాపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కన్నూమిన్నూ గానకుండాచెలరేగడం సహజం. సరైన సమయంలో కోదండరాం తన సారథ్యంలో జేఏసీని మళ్లీ పట్టాలపైకి తెచ్చి… మరో పోరాటానికి సిద్ధం అవుతున్నారు.
ప్రొఫెసర్ పదవినుంచి రిటైరు అయినప్పుడే.. పలు రాజకీయ పార్టీలనుంచి ఆఫర్లు వచ్చినా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాజకీయ ప్రమేయం లేకుండా.. బంగారు తెలంగాణ కోసం తన భవిష్యత్ జీవితం ఉంటుందని ఆనాడే ప్రకటించారు. దానికి నిర్దిష్టమైన కార్యరూపం ఇవాళ జేఏసీ గా వచ్చినట్లుంది. ప్రజల పక్షాన ప్రతిపక్షం పాత్రను పోషిస్తూ ప్రభుత్వం గాడి తప్పి పాలించకుండా బాధ్యతగా చూస్తుంటామని జేఏసీసారధిగా కోదండరాం చెబుతుండడం గమనించాల్సిన విషయం. తమ పాలన గురించి కేసీఆర్ తదితరులు ఎన్ని గప్పాలు కొట్టుకున్నా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కొత్తగా ఎదురౌతున్నాయో కోదండరాం వివరించి చెబుతున్నారు. వాస్తవంగా తెలంగాణకు అవసరమైన డిమాండ్లను ఆయన తెరమీదికి తెస్తున్నారు. మరి కోదండరాం పోరాడే అంశాల పట్ల కేసీఆర్ సర్కారు వాస్తవాన్ని గుర్తెరిగి పాజిటివ్‌గా స్పందిస్తుందా? లేదా, క్రెడిట్ ఆయనకు పోతుందనుకుని.. విస్మరించి ప్రజానీకానికి అన్యాయం చేస్తుందా వేచిచూడాలి!!