సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మహేష్- కొరటాల సినిమా విషయం లో అలాంటి సెంటిమెంట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. అవును, మహేష్ బాబు దర్శకులకి ద్వితీయ విఘ్నం ఉంది. ఇప్పుడు కొరటాల శివ ఈ ద్వితీయ విఘ్నాన్ని దాటుతాడా అనే సందేహం ఇలాంటి సెంటిమెంట్లు నమ్మేవాళ్ళలో బలంగా కనిపిస్తోంది.
మహేష్ బాబు కెరీర్ లో మొదటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్. సినిమా “ఒక్కడు”. అయితే అదే దర్శకుడు మహేష్ బాబు తో తీసిన రెండవ సినిమా “అర్జున్ ” ఫ్లాప్. మహేష్ తో మూడు సినిమాలు తీసిన ఏకైక దర్శకుడు ఈయన. అయితే అ మూడో సినిమా సైనికుడు మరీ ఘోరంగా ఫ్లాపైంది. అలాగే మహేష్ బాబు కెరీర్ లో మరో సెన్సేషనల్ హిట్ “దూకుడు”. దాని దర్శకుడు శ్రీను వైట్ల మహేష్ బాబు తో తీసిన రెండవ సినిమా “ఆగడు”. ఇదీ ఫ్లాపే. ఇక “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” తో మహేష్ తో సంక్రాంతి సీజన్ లో మంచి హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల , మహేష్ తో తీసిన తదుపరి సినిమా “బ్రహ్మోత్సవం” గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే దర్శకుడు త్రివిక్రం తీసిన “అతడు” ఓ మోస్తరు హిట్టయితే, “ఖలేజా” సినిమా మాత్రం కాస్తో కూస్తో బాగుండీ ఫ్లాప్ అయ్యింది. చిత్రంగా టివిల్లో టెలికాస్ట్ అయినపుడు మాత్రం అద్భుతమైన టీఆర్పి తెచ్చుకుంది. సో, శ్రీమంతుడు తో మహేష్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల ఇప్పుడు ఈ ద్వితీయ విఘ్నాన్ని దాటుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ముందే చెప్పుకున్నట్టు, సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చిత్రవిచిత్రమైనవి. ప్రతి సెంటిమెంట్ కీ “కౌంటర్ సెంటిమెంట్లు” కూడా ఉంటాయి. కొరటాల “శ్రీమంతుడు” తీయడానికి ముందు మహేష్ కి సరిగ్గా రెండు ఘోరమైన ఫ్లాప్స్ ఉన్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వచ్చిన సినిమాలు “1 – నేనొక్కడినే”, “ఆగడు” – ఈ రెండూ ఫ్లాపయ్యాయి. అలా, రెండు ఫ్లాపుల తర్వాత మహేష్ ని ఫ్లాపుల్లోంచి బయటపడేసి, శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది కొరటాల నే. ఇప్పుడు శ్రీమంతుడు తర్వాత, బ్రహ్మోత్సవం , స్పైడర్ అని మళ్ళీ సరిగ్గా రెండు ఫ్లాపులు వచ్చాయి. మరి, ఇప్పుడు కూడా ఈ సెంటిమెంటుని అనుసరించి, కొరటాల మహేష్ ని ఫ్లాపుల్లోంచి బయట పడేస్తాడా, అనేది కూడా ఆసక్తికరమే.
ఏది ఏమైనా, మంచి కథ ఉంటే, అన్ని సెంటిమెంట్లని కాదని హిట్టయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే, ఇంకో కొసమెరుపేంటంటే, మహేష్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్టిచ్చిన ‘పోకిరీ’ పూరీ ‘ ని మాత్రం ఈ ద్వితీయవిఘ్నం ఏమీ చేయలేకపోయింది. పోకిరి అంత కాకపోయినా “బిజినెస్ మేన్” హిట్టే మరి!