తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న.. కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఎప్పుడు..? అనే. ఈ విషయంలో ఏం జరిగినా ఊహాగానాలే. కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియదు. అయితే.. ఈ విషయంలో కేసీఆర్.. కొన్ని సంకేతాలను తన సన్నిహితుల ద్వారా… ప్రజల్లోకి పంపుతూంటారని… కొంత మంది నమ్ముతూంటారు. ఇప్పటికే కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి..? అనే వాదనలు ఆ పార్టీలో జోరుగా సాగుతున్న సమయంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు… మంత్రి కేటీఆర్ సమక్షంలోనే కాబోయే సీఎం అని చెప్పి అభినందించేశారు. పద్మారావు ఉద్యమ సమయం నుంచి కేసీఆర్తో సన్నిహితంగా ఉన్న నేత. ఇలాంటి కీలక విషయాలపై కేసీఆర్ నుంచి సంకేతాలు అందకపోతే మాట్లాడరు. ఇదే విషయాన్ని అందరూ చెప్పుకున్నారు.
అదే పద్మారావు ఇప్పుడు కేటీఆర్ ను ఎప్పుడు సీఎంగా చేస్తారో కూడా ప్రకటించారు. యాదాద్రి లక్ష్మినరసింహాస్వామి ఆలయం ప్రారంభమైన గంటల్లోనే… కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం ఉంటుందని ఆయన తేల్చేశారు. యాదాద్రిని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దాలని సంకల్పించారని.. ఆ మేరకు పనులు పూర్తయ్యాయని… ఇక ప్రారంభోత్సవమే మిగిలిందని.. అంటున్నారు. ఆ ఆలయ ప్రారంభోత్సవం అయిన వెంటనే… కేసీఆర్… కుమారుడికి పదవి అప్పగిస్తారని ఆయన తేల్చారు. పద్మారావు ఇలాంటి ముహుర్తాలను ఖచ్చితంగా చెప్పారంటే.. ఇది కూడా పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకేనని.. నమ్ముతున్నారు.
యాదాద్రి ఆలయాన్ని ఫిబ్రవరిలోనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. కట్టడాలతో పాటు సుందరీకరణ పనులన్నీ తుది దశకు చేరాయి. గత ఏడాదే ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ వాయిదా వేశారు. అది ఫిబ్రవరికి వాయిదా వేశారు. త్వరలోనే చినజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ కలిసి ముహూర్తం ఖరారు చేస్తారు. ఇటీవల కేసీఆర్ తరచూ యాదాద్రిపై సమీక్షలు చేస్తున్నారు. ఆలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. యాలయ ప్రారంభోత్సవాన్ని కనివినీ ఎరుగని రీతిలో చేయనున్నారు. 1,048 యజ్ఞ కుండాలతో మహా సుదర్శన యాగం కూడా చేయనున్నారు.