మూసీపై ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ప్రాజెక్టు మా డ్రీమ్ ప్రాజెక్టు అని కేటీఆర్ చెబుతారు. రేవంత్ అదే చెబుతారు. కానీ మానవీయ కోణంలో ఆపేశామని కేటీఆర్ అంటారు. ఇవన్నీ కాదు అసలు అసెంబ్లీలో చర్చకు వస్తే అసలు ఆ ప్రాజెక్టు అవసరమో కాదో తేల్చేద్దామని రేవంత్ సవాల్ చేశారు. కానీ అటు హరీష్ కానీ ఇటు కేటీఆర్ కానీ ప్రెస్మీట్లు పెట్టి రేవంత్ పై విమర్శల దండకం వినిపించారు కానీ అసెంబ్లీలో చర్చకు రెడీ అన్న మాట మాత్రం రానివ్వలేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్కు మంచి బలం ఉంది. అధికార పార్టీ అయినంత మాత్రాన నోరు నొక్కేయబోమని బీఆర్ఎస్ వాయిస్ ను కూడా గట్టిగా వినిపించేందుకు అవకాశం ఇస్తామని గత సమావేశాల్లోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సస్పెండ్ అయ్యేవారు. వన్ సైడ్ చర్చలు జరిగేవి. సొంత గొప్పలు చెప్పుకుని వెళ్లిపోయేవారు. ఇప్పుడు చర్చల జరుగుతున్నాయి. బీఆర్ఎస్ తన వాదనను కూడా వినిపించే అవకాశం ఉంది. అయినా మూసీపై చర్చకు అసెంబ్లీకి వస్తారా రారా అన్నది మాత్రం బీఆర్ఎస్ చెప్పడం లేదు.
కోర్టుకు వెళ్లి కొండా సురేఖకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సి ఉన్నా వాయిదా వేసుకుని మరీ మూసి పవర్ పాయింట్ పై పని చేశారు కేటీఆర్ . మీడియా ముందు కూడా ఆవిష్కరించారు. అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కొత్తవేమీ లేవు. అసలు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలా వద్దా అన్నది చెప్పలేదు. అసలు అభ్యంతరాలేమిటో స్పష్టత లేదు. ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో డీపీఆర్ కోసమే టెండర్ పిలిచామని రేవంత్ చెప్పినా మళ్లీ లక్షన్నర కోట్ల కథను కేటీఆర్ వివరించారు. మూసీ విషయంలో చెప్పిందే చెబుతున్నారు కానీ అసలు విషయానికి మాత్రం బీఆర్ఎస్ రాలేకపోతోంది.