రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ వచ్చిన తర్వాత .. సీనియర్ల వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. కొంత కాలం సైలెంట్‌గా ఉన్నా ఇటీవలి కాలంలో పార్టీని బలహీనం చేస్తే రేవంత్ రెడ్డిని చేసినట్లేనని భావిస్తూ .. ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డు పడుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి .. ప్రత్యేక తెలంగాణ తల్లి విగ్రహం..ప్రత్యేక తెలంగాణ గీతం వంటి వాటిని ఎంపిక చేసి కొత్త సెంటిమెంట ప్రారంభిద్దామనుకున్నారు. ఇందు కోసం కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిజైన్ చేయించి తొలి విగ్రహాన్ని ..సెప్టెంబర్ 17న ఆవిష్కరించాలనుకున్నారు.
కానీ యథావిధిగా సీనియర్లు అడ్డు పడ్డారు. రకరకాల ఫిర్యాదులు చేసి.. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించవద్దని ఆదేశాలు వచ్చేలా చూసుకున్నారు. ఫలితంగా నమూనాను మాత్రమే టీ పీసీసీ విడుదల చేయగలిగింది. సీనియర్లు ఇలా రేవంత్ రెడ్డికి అడుగడుగునా అడ్డం పడటం వెనుక ఉన్న బలమైన శక్తి కేవీపీ అన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ తో ఇటీవలి కాలంలో కేవీపీ సన్నిహిత సంబంధాలును నెలకొల్పుకున్నారని ఆయన ద్వారానే తెలంగాణ కాంగ్రెస్‌లో ఎక్కువగా రచ్చ చేయిస్తున్నారన్న అనుమానాలు రేవంత్ వర్గీయుల్లో ప్రారంభమయ్యాయి.
ఇటీవల కొంత మంది నేతలతో కేవీపీ చర్చలు జరపడం కూడా దీనికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటాయన్న ప్రచారం.. సోషల్ మీడియాలో ప్రారంభం కావడం వెనుకా కేవీపీ ఉన్నారని అనుమానిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇతర పార్టీలతోనే కాదు ..సొంత పార్టీలోనే కేవీపీతోనూ ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.