రాజధాని విషయంలో ప్రభుత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం కోరాలన్న డిమాండ్లు వినిపిస్తున్న సమయంలోనే… స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, మున్సిపల్ ఎన్నికలు అన్నీ వరుసగా జరగనున్నాయి. అంటే.. ఏపీలో ఉన్న ఓటర్లందరూ.. దాదాపుగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అందుకే.. రాజకీయ పార్టీలు ఇప్పుడు.. ఈ ఎన్నికలను రాజధానిపై రిఫరెండంగా ప్రచారం ప్రారంభించాయి. రాజధాని మార్పు కావాలన్న వాళ్లు అధికార పార్టీకి.. రాజధాని అమరావతిలోనే ఉండాలనుకున్న వాళ్లు… ప్రతిపక్షాలకు ఓట్లు వేయమనే ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. త్యాగం చేసిన రాజధాని రైతులకు మద్దతుగా నిలబడాలని ఓటర్లకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోంది.
నిజానికి స్థానిక ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా… గ్రామ, మండల రాజకీయాలకే పరిమితమవుతాయి. స్థానిక అధికారం కోసం జరిగే పోటీ కాబట్టి.. ఇతర అంశాలు అక్కడి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ప్రభుత్వం అధికారం చేపట్టి.. ఏడు నెలలు మాత్రమే అయినప్పటికీ.. ప్రజా జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంది. అందుకే రాజకీయ పార్టీలు.. రాష్ట్ర స్థాయి అంశమైన.. రాజధానిని తెర ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఈ మేరకు ప్రకటనలు చేస్తున్నారు.
ప్రభుత్వాలు ఏ ఎన్నిక జరిగినా.. ఫలితాలు తమ పాలనకు గీటు రాయి అని చెప్పుకునేందుకు ఆసక్తి చూపించవు. ముందుజాగ్రత్తే దానికికారణం. ఇప్పుడు.. ఏడు నెలల పాలనపై రిఫరెండమని కానీ.. రాజధానిపై ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు… తమ ఓటు ద్వారా అభిప్రాయం చెప్పవచ్చని కానీ.. ప్రభుత్వం ప్రకటించే పరిస్థితి లేదు. రిఫరెండం ప్రకటనలు రాగానే.. మంత్రులు ఉలిక్కి పడ్డారు. అవి స్థానిక ఎన్నికలు మాత్రమేనని… రిఫరెండం కాదని.. అవంతిశ్రీనివాస్ లాంటి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. రిఫరెండంగా ప్రకటించుకున్న తర్వాత ఫలితాలు తేడాగా వస్తే.. రాజీనామాకు డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రజాదరణ పడిపోయిందని తెలిస్తే.. పరిస్థితులు కూడా మారిపోతాయి.