తెలుగుదేశం పార్టీ నిర్వహణకు సంబంధించి.. చంద్రబాబునాయుడుకు వారసుడు అనుకుంటున్న నారా లోకేశ్ పార్టీ జాతీయ కమిటీకి ప్రధాన కార్యదర్శి పదవిని చేతపట్టిన తర్వాత.. వచ్చిన మొదటి ఎన్నికల జాతర ఈ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలే! నిజానికి ఒక నగర కార్పొరేషన్‌కు సంబంధించిన ఎన్నికలే అయినప్పటికీ.. మన దేశంలోనే ఒక చిన్న రాష్ట్రానికి దీటుగా బడ్జెట్‌ను కలిగి ఉండే హైదరాబాద్ ఎన్నికలు కావడంతో… టికెట్ల కోసం పోటీ, వ్యూహ ప్రతివ్యూహాలు పార్టీ నాయకత్వం మీద ఒత్తిళ్లు ఇవన్నీ భారీస్థాయిలోనే జరిగాయి. ఇదంతా ఒక ఎత్తు.. అయితే, అంతా ముగిసిన తర్వాత.. తమ పార్టీలో టికెట్ల పంపకం అంత చాలా పారదర్శకంగా, నిజాయితీగా జరిగిందంటూ.. లోకేశ్ ఘనంగా చెప్పుకున్నారు. అయితే వాస్తవానికి వస్తే.. ఈ ఎన్నికల టికెట్ల పంపకం అనే గండం దాటి రావడంలో లోకేశ్ ఫెయిలయ్యాడనే విమర్శలు పార్టీ వర్గాలనుంచే వినిపిస్తున్నాయి.
కేవలం నగరంలో తెలుగుదేశానికి మిగిలిన కొందరు కీలక నాయకులు పార్టీని వీడిపోవడం ఒక్కటే కారణంకాదు. టికెట్ల పందేరంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు కలిపి.. నిర్వహణలో లోకేశ్ అనుకున్నంత సమర్థంగా వ్యవహరించలేదన్న ఆరోపణలకు కారణం అవుతున్నాయి. పార్టీనుంచి ఉపాధ్యక్షుడు కృష్ణయాదవ్ లాంటి సీనియర్లు, నగరంలో పార్టీకి కీలకంగా ఉన్న మరికొందరు నాయకులు రాజీనామాలు చేసేశారు. కొందరు తెరాసలో చేరే పర్వం కూడా పూర్తయింది. అయితే ఈ క్రైసిస్ మేనేజిమెంట్ పార్టీలో సరిగ్గా జరగలేదన్నది పలువురి వాదన.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, భాజపా కలిసి పోటీచేస్తున్నాయి. అయితే నిజానికి వీరు డివిజన్లను పంచుకోవడంలోనే లోపాలున్నాయని పలువురు అంటున్నారు. తెరాసకు మేలు జరిగేలా.. బలం ఉన్న వార్డులు కూడా కొన్నిటిని వదులుకోవడం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. క్రమశిక్షణ ఉన్న పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశంలోనే.. భాజపాకు కేటాయించిన డివిజన్లలో అంతిమంగా తెదేపా వారే ఫైనలైజ్ కావడం, పార్టీ నగర అధ్యక్షుడి నుంచి ఖాళీ బీఫారాలను తీసుకువెళ్లిపోయి.. కార్యకర్తలు కొందరు ఎవరికి తోచిన చోట వారు తమకు తోచిన విధంగా ఆ ఫారాలను నింపుకుని నామినేషన్లకు జతగా సమర్పించేసుకోవడం.. ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలన్నీ చోటు చేసుకున్నాయి. నిజానికి ఈ వ్యవహారాలన్నీ పార్టీల్లో క్రమశిక్షణ లోపానికి ప్రతీకలు అని చెప్పుకోవాలి.
ఎన్నికల టికెట్ల పందేరం సమయంలో ఇలాంటి అసంతృప్తులు ఎవ్వరికైనా తప్పవు. అయితే.. ఇంటిగుట్టు బయటకు పొక్కకుండా కాపాడుకున్నప్పుడే పార్టీ నాయకత్వానికి విలువ దక్కుతుంది. ఆ విషయంలో లోకేశ్ విఫలం అయినట్లుగా విమర్శలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి బల్దియాలో గతంలో ఉన్నన్ని స్థానాలను మళ్లీ సాధించగలిగితే.. మాత్రం.. అది ఖచ్చితంగా లోకేశ్ ఘనత కిందికే వస్తుంది. ఒకసారి విజయం గనుక దక్కితే వైఫల్యాలన్నీ దాని మరుగున పడిపోతాయి. దానికోసం ఈ యువనేత ఏం కసరత్తు చేస్తారో వేచిచూడాలి.