ఈ మధ్యనే ఏపీ క్యాబినెట్ లో కొత్త మంత్రులు కొలువుదీరారు. ఎన్నో విమర్శలకోర్చి, ఎంతో మేథోమధనం చేసి, వ్యక్తమౌతున్న వ్యతిరేకతను తట్టుకుని, వర్గపోరును జయించి.. ఇలా ఎన్నో త్యాగాలు (వాళ్ల పాయింటాఫ్ వ్యూలో) చేసిన కొందరు ఫిరాయింపుదారులు మంత్రులయ్యారు! ‘హమ్మయ్య.. ఏదైతేనే మంత్రి కుర్చీలోకి వచ్చేశాం. ఇక మనదే రాజ్యం’ అనుకునేంత సీన్ జంప్ జిలానీలకు లేదని ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది! టీడీపీలో ఉన్న వైకాపా మంత్రులకు తాజాగా తత్వం బోధపడుతోందట! మంత్రి పదవి వారికి కేవలం అలంకారం మాత్రమే. పనులన్నీ పెద్దమనసుతో చినబాబు చూసుకుంటున్నారని సమాచారం.
ఆఫీస్ లో సిబ్బందిని మంత్రులే నియమించుకుంటారు కదా! అంటే, పీయేలూ పి.ఎస్.లూ పీఆర్వోలూ ఇలాంటి పోస్టుల్లో తమకు కావాల్సినవారినే ఏ మంత్రైనా పెట్టుకుంటారు. ఫిరాయింపు మంత్రులూ అలానే అనుకున్నారట. క్యాబిన్లో కూర్చోగానే సిబ్బందిని నియమించుకోవాలని భావించారు. కానీ, ఈలోగా ఒక వ్యక్తి వచ్చి.. ‘నేనే మీ పీయే’ అనీ, మరొకరు ‘నేనే మీ పీఆర్వో’ అంటూ పరిచయాలు చేసుకున్నారట! ఈ పరిస్థితి బొబ్బిలి రాజావారికి ఎదురైందని తెలుస్తోంది. జంప్ జిలానీల్లో సుజయ్ కృష్ణరంగా కూడా ఉన్నారు. జంపింగ్ పుణ్యమా అని బొబ్బిలి రాజావారికి మంత్రి పదవి దక్కింది. ఆయనకు వ్యక్తిగతంగా ఇద్దరు సిబ్బంది ఉన్నారు. వారినే పీయేలుగా, పి.ఎస్.లుగా నియమించుకోవాలని అనుకున్నారు. కానీ, ఈలోగా ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చి ‘మేమే మీ సిబ్బంది’ అంటూ పరిచయం చేసుకున్నారట. దీంతో బొబ్బిలి రాజు షాక్ అయ్యారు. అంతేకాదు.. తాము లోకేష్ బాబు పంపిస్తే వచ్చామని, ఆయనే తమని నియమించారని చెప్పడం ఇంకో షాక్!
కాస్త అటుఇటుగా ఇతర జంప్ జిలానీ మంత్రులకూ ఇలాంటి అనుభవాలే ఈ మధ్య వరుసగా ఎదురౌతున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే, తనతోపాటు మంత్రులుగా ప్రమాణం చేసినవారి బాధ్యతల్ని కూడా అప్రకటితంగా నారా లోకేష్ చూసుకుంటున్నట్టే కదా! ఆ మాటకొస్తే… చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్న ఇతర మంత్రుల పేషీల్లో కూడా చినబాబు చెప్పిందే జరుగుతోందని ఎప్పట్నుంచో వినిపిస్తున్న ఆరోపణ. ఆయన మంత్రికాక ముందే బదిలీలు, నియామకాలు చూసుకునేవారని అంటుండేవారు. అలాంటప్పుడు ఇప్పుడీ ఫిరాయింపు మంత్రుల విషయంలో అంతకంటే భిన్నంగా జరుగుతుందా అంటూ కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. కాకపోతే, జంప్ జిలానీలకు ఈ అనుభవం కాస్త కొత్త… అంతే!
మొత్తానికి, ఫిరాయింపు మంత్రులకు తత్వం బోధపడింది. ఇకపై వారు ఎలా ఉండాలో.. ఎలా వ్యవహరించాలో.. ఎలా నిర్ణయాలు తీసుకోవాలో అన్నీ స్పూన్ ఫీడింగ్ అన్నమాట! మంత్రులం కదా.. స్వతంత్రంగా ఆలోచిస్తాం అంటే కుదరదన్నమాట!