రవితేజ నుంచి నాగచైతన్యకు, నాగచైతన్య నుంచి కార్తికేయ దగ్గరకూ వెళ్లి.. చివరికి శర్వానంద్ ముందు వాలింది మహా సముద్రం కథ. ఆర్.ఎక్స్ 100 తరవాత ఈ కథనే పట్టుకుని ఇండ్రస్ట్రీ మొత్తం చక్కర్లు కొడుతున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ కథ హీరోలందరికీ నచ్చేసింది కానీ, ఏవేవో కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. అన్నింటికంటే ఇది మల్టీస్టారర్ సబ్జెక్టు. ఇద్దరు హీరోల్ని ఒకేసారి వెదికి పట్టుకుని, కథని పట్టాలెక్కించడం చాలా కష్టం. అందుకే ఈ కథ ముందుకు వెళ్లడం లేదు. శర్వా మాత్రం ఈ కథకి పచ్చజెండా ఊపాడు. రెండో హీరోని వెదికి పట్టుకోవడం అజయ్ భూపతికి పెద్ద కష్టమేం కాదు.
కాకపోతే… ఈ కథ శర్వానంద్‌కు సెట్ అవుతుందా, లేదా? అనేదే పెద్ద డౌటు. ఎందుకంటే ఇది మహా సముద్రం అనేది మాస్ కమర్షియల్ సినిమా. ఇలాంటి మాస్ కథలు ఎంచుకుని, ఇది వరకు చాలా తప్పులు చేశాడు శర్వానంద్. 2019లో శర్వా ఖాతాలో రణరంగం లాంటి డిజాస్టర్ ఉంది. మాస్‌ని మెప్పించడానికి శర్వా చేసిన ప్రయత్నాల్లో ఇదొకటి. ఇదే అని కాదు, ఇది వరకు ఇలాంటి కథలెప్పుడు ఎంచుకున్నా, శర్వానికి సరైన ఫలితాల్ని ఇవ్వలేదు. 96, శ్రీకారం లాంటి క్లాస్ టచ్ ఉన్న కథలైతే తనకు బాగా నప్పుతాయి. ఈ టైమ్‌లో మహా సముద్రం స్క్రిప్టుని శర్వా ఎంత వరకూ సూటవుతాడన్నది పెద్ద ప్రశ్న. అయినా సరే, మాస్ హీరోగా మెప్పించాలన్న తపనతోనే ఈ కథని ఓకే చేశాడు శర్వా. ఈ సినిమా కూడా అటూ ఇటూ అయితే.. భవిష్యత్తులో శర్వానంద్ వీటి జోలికి వెళ్లడేమో..??