మహేష్ బాబు 25వ సినిమా. కచ్చితంగా సమ్‌థింగ్ స్పెషలే. సూపర్ స్టార్ సినీ జీవితంలో ఓ మైలురాయిలంటా సినిమా.. ప్రత్యేకంగా ఉండాలనుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. అందుకోసం రెండేళ్లు కష్టపడొచ్చు. రూ.140 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. మూడు అగ్ర నిర్మాణ సంస్థలు కలవొచ్చు.
కానీ.. ఇలాంటి కథ కోసమా? ఇలాంటి అవుట్‌పుట్ కోసమా?
సినిమా అనేది మేకింగ్ విషయంలో ఫెయిల్ అవ్వనప్పుడు, నటీనటుల విషయంలో ఫెయిల్ అవ్వనప్పుడు, కంటెంట్ పరంగా ఫెయిల్ అవ్వకపోయినప్పుడు, నెగిటీవ్ టాక్ వస్తే.. కచ్చితంగా అది దర్శకత్వ లోపమే. అలాంటి లోపాలు `మహర్షి`లో చాలా కనిపించాయి. మహర్షిలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బృహత్తరమైనదీ, మహత్తరమైనదీ ఏం కాదు. ఇప్పటికే రైతు సమస్యలపై చాలా సినిమాలొచ్చాయి. దానికి కాస్త స్టార్ డమ్ జోడించిన ఖైది నెం 150 కూడా వచ్చింది. అదే జోనర్లో ఓ కథ చెప్పాలనుకోవడం, అందుకు మహేష్‌బాబు లాంటి స్టామినా ఉన్న హీరోని వాడుకోవడం ఆశ్చర్యపరుస్తాయి. స్నేహం విలువ, రైతు సమస్యలు, కార్పొరేట్ సంస్థలు రైతుల భూముల్ని ఆక్రమించుకోవాలనుకోవడం ఇవన్నీ స్మూత్‌గా డీల్ చేయదగిన అంశాలు కావు. అయినా సరే – వాటిని నమ్ముకుంటూ ఓ కమర్షియల్ సినిమా తీయాలనుకోవడం సాహసం. ఈ తూకంలో ఏమాత్రం తేడా జరిగినా ఫలితం తేడా వచ్చేస్తుందని తెలుసు. అయినా సరే.. ధైర్యంగా, ముందడుగు వేశారు.
రిషి క్యారెక్టరైజేషన్‌లోనే ఏదో తేడా కనిపిస్తుంది. తొలి సగంలో.. ఓవర్ కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తాడు. ఓ హీరో `నేను ప్రపంచాన్ని ఏలాలి` అనుకోవడం కచ్చితంగా హీరోయిజమే. కానీ అలాంటి డైలాగ్ చెప్పే విషయంలోనూ మహేష్‌లో కాన్ఫిడెన్స్ కనిపించదు.. ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప. ఇది కావాలని చేసిందా? లేదంటే మహేష్ నటన వల్ల అలా అనిపించిందా? అనేది అర్థం కాదు.
ప్రతీ పాత్రకీ ఓ జస్టిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నాడు దర్శకుడు. స్క్రీన్ ప్లేలో అది చాలా ప్రధాన సూత్రం కూడా. కానీ లెక్కకు మించిన పాత్రలు ఉన్నప్పుడు ఈ థియరీ కరెక్ట్ కాదు. ప్రతీ పాత్రనీ చివరి వరకూ వాడుకోవాలని చూడడం వల్ల సన్నివేశాలు పేరుకుపోవడం తప్ప.. మరో ప్రయోజనం ఉండదు. బస్ స్టాండ్ లో తనయుడి కోసం ఎదురుచూసే ముసలమ్మ పాత్ర నుంచి ఫస్ ర్యాంక్ కోసం రిషితో పోటీ పడే కమల్ కామరాజు పాత్ర వరకూ.. ప్రతీ పాత్రకూ ఓ ముగింపు ఉండాలని చూశాడు. అలా చూడడమే కొంప ముంచింది. అనవసరమైన సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లడం వల్ల మూడు గంటల సినిమా వచ్చింది. అలాగని కీలక పాత్రల్ని వదిలేయడం బాధిస్తుంది.
కొడుకుతో మాట్లాడలేనంత పాపం తండ్రి ఏం చేశాడు?
అసలు ప్రొఫెసర్ న్యూయర్స్ వచ్చేంత వరకూ రుషికి రవి గురించి ఆరా తీయాలని ఎందుకు అనిపించలేదు?
పూజా ప్రేమని ముందు యాక్సప్ట్ చేసిన రిషి, ఆ తరవాత ఎందుకు తిరస్కరించాడు?
వీటికి సమాధానం రెండేళ్ల పాటు కష్టపడి ఈ కథని తయారు చేసుకున్న వంశీకైనా తెలుసా? మామూలు కమర్షియల్ సినిమా అయితే ఇన్ని లాజిక్కులు, ఇన్ని ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు. ఇదో ఉదాత్తమైన సినిమా, ఈ సమాజానికి మంచి చెప్పే సినిమా అని చిత్రబృందం పదే పదే చెప్పడం వల్ల ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం చిత్రబృందానికి ఏర్పడింది. ఆరు నెలల్లో సినిమా చుట్టి పరేస్తే, ఆ కంగారులో తప్పులు చేశారేమో అని సరిదిద్దుకోవొచ్చు. యేడాది పాటు సినిమా తీస్తూ తీస్తూ.. చివరి నిమిషం వరకూ మార్పులు చేర్పులూ చేసుకుంటూ వెళ్లారు కాబట్టి.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సివస్తోంది. స్క్రిప్టు దశలోనే పరిహరించాల్సిన అనేక లోటుపాట్లు… తెరపై వచ్చేంత వరకూ ఎవరూ కనిపెట్టలేదంటే.. అది కచ్చితంగా దర్శక నిర్మాతల అతి విశ్వాసమే. ఇప్పుడు వాటిని పరిహరించాలని కంకణం కట్టుకుని, యుద్ద ప్రాతిపదికపై రంగంలోకి దిగినా… లాభం లేకుండా పోయింది. మొత్తానికి మహేష్ 25వ సినిమా… తప్పుల తడకతో, అనేక లోటు పాట్లతో మహేష్ అభిమానుల్ని సైతం అసంతృప్తికి గురి చేసింది.