వైసీపీ సీనియర్ నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అధికారం ఉన్నన్నాళ్లు లౌడ్ స్పీకర్ లాగా చెలరేగిపోయిన సీనియర్లు.. అధికారం కోల్పోయాక కిక్కురుమనడం లేదు. వైసీపీ అనుకూల మీడియాలో తరుచుగా కనిపించే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా పెదవి విప్పడం లేదు. దీంతో మల్లాది మౌనంపై బెజవాడ పొలిటికల్ చౌరస్తాలో పెద్ద చర్చే జరుగుతోంది.
ఎన్నికల సమయంలో పలువురు నేతలను వేర్వేరు నియోజకవర్గాలకు బదిలీ చేసిన జగన్…మల్లాది ఇలాకాలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఛాన్స్ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరో నేతను పోటీ చేయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినా.. జగన్ బుజ్జగింపులతో మెత్తబడినట్లుగానే కనిపించింది. వెల్లంపల్లికి సహకరించాలని జగన్ కోరినా అక్కడ బొండా ఉమాకు భారీ మెజార్టీ రావడంతో మల్లాది మద్దతుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బెజవాడ సీటులో ఓటమి పాలవ్వడంతోపాటు, వైసీపీ అధికారం కోల్పోవడంతో కొంతకాలంగా మల్లాది విష్ణు మౌనంగానే ఉంటున్నారు. ఇటీవలి వరదల సమయంలోనూ యాక్టివ్ గా కనిపించకపోవడంతోపాటు తన అనుకున్న అతి కొద్ది మందికి మాత్రమే సాయం అందించారని.. మిగిలిన వారిని పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇక, జగన్ అప్పుడప్పుడు నిర్వహిస్తోన్న సమావేశాలకు కూడా మల్లాది దూరంగా ఉంటుండటంతో ఆయన కినుకకు కారణం ఏంటన్నది ఎవరికీ తెలియడం లేదు. అదే సమయంలో ఆయన పార్టీ మారే ఆలోచనతోనే వైసీపీతో అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారని అనే ప్రచారం జరుగుతోంది. ఆయన చేరాలనుకున్న పార్టీ నుంచి ఆహ్వానం అందితే జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా… అక్కడి నుంచి సిగ్నల్స్ రావడం లేదని అంటున్నారు. సమయం వస్తే పార్టీ మారేందుకు సిద్ధమయ్యే వైసీపీకి దూరంగా ఉంటున్నారని అని మల్లాది సన్నిహిత వర్గాల్లో చర్చ అయితే జోరుగా జరుగుతోంది.