తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి బీజేపీలో టచ్ లో ఉన్నారన్న విషయం ఒక్క సారిగా గుప్పుమంది. అదేంటి ఆయన మొన్నే కదా ఐటీ అధికారులపై సైతం దాడుల్లాంటి వాటికి ప్రయత్నించి.. కేసీఆర్ ఉండగా తనకేం కాదని.. ప్రకటించారని అనుకుంటున్నారు. కేసీఆర్ పై అంత విశ్వాసం ప్రకటించి.. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారా అన్న ఆశ్చర్యం చాలా మందిలో ఉంది. అయితే తెర వెనుక విషయాలు మాత్రం మెల్లగా వెలుగులోకి వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. మామూలుగా ఇలాంటి సమావేశాలు.. పార్టీ హైకమాండ్‌కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తాయి. కానీ మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో జరిగిన ఆ సమావేశంపై పార్టీ హైకమాండ్ పెద్దగా స్పందించలేదు. ఎమ్మల్యేలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు తాజాగా వారు .. గ్రూపుగా తిరుమల కూడా వెళ్లారు. దీనిపై బీఆర్ఎస్లో పెద్దగా హడావుడేం జరగడం లేదు. ఎందుకంటే.. వారు మల్లారెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపించింది.. హైకమాండ్ సూచనలతోనేనన్న సమాచారం బీఆర్ఎస్ లో అంతర్గతంగా అందరికీ తెలిసింది.
మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడుల తర్వాత వారి వ్యవహారాలు మొత్తం బయట పడ్డాయి. మెడికల్ కాలేజీలు..ఇంజినీరింగ్ వ్యవహారాల్లో ఈడీని కూడా రంగంలోకి దిగారని ఐటీ కోరింది. కానీ ఈడీ ఇంత వరకూ ఆ వైపుగా దిగలేదు. మామూలుగా అయితే ఈడీ కూడా సెర్చెస్ చేసి ఉండేది దీనంతటికి కారణం .. మల్లారెడ్డి బీజేపీతో టచ్ లోకి వెళ్లారని.. జంప్ అవడానికి ఓకే చెప్పారన్న విషయం.. బీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసిందంటున్నారు. అందుకే ఆయనపై అసమ్మతిని ప్రోత్సాహిస్తున్నారని.. క్లారిటీ రాగానే పదవి నుంచి కూడా తప్పించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి మల్లారెడ్డి రాజకీయం మరో మలుపు తిరగబోతోందని.. తెలంగాణలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.