బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంటర్యూలో.. ఓ హైలెట్ విషయం… తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ.. తనకు స్వీట్లు, కొత్త బట్టలు పంపుతారని చెప్పడం. బెంగాల్లో ఇప్పుడు బీజేపీ – తృణమూల్ ల మధ్య వ్యవహారం ఉప్పూ నిప్పులా ఉంది. మోదీ పేరు చెబితేనే మమత మండిపడుతున్నారు. చౌకీదార్ దేశాన్ని నాశనం చేశారంటూ ఆమె తీవ్రంగా విమర్శిస్తున్నారు. మోదీ దించడమే ప్రధాన అజెండాగా ఆమె విపక్షాలను ఏకం చేస్తున్నారు. బెంగాల్ వెళ్లినప్పుడు మోదీ కూడా అంతే స్థాయిలో దీదీని విమర్శిస్తుంటారు. శారదా, నారదా స్కాంతో దాచిన డబ్బు అంటూ ఆమెపై దుమ్మెత్తిపోస్తుంటారు. ఇలాంటి సమయంలో.. మోడీ.. మమతా బెనర్జీపై ఇంత సానుకూల వ్యాఖ్యలు చేయడం కచ్చితంగా రాజకీయంగా కలకలం సృష్టించేదే.
కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ ఏర్పాటు చేసిన తర్వాత దీదీ, ఎన్డీయేలో చేరారు. 1999లో వాజ్ పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎన్డీయే నుంచి విడిపోయి కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కొంతకాలానికి కాంగ్రెస్ నుంచి కూడా దూరమై శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సీఎం అయ్యారు. కానీ ఎప్పుడూ.. మోడీతో కలిసి రాజకీయం చేసింది లేదు. వాజ్పేయి హయాంలో.. మోడీ.. బీజేపీలో… ఓ ముఖ్యమంత్రి మాత్రమే. మోదీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి మమత ఆయన్ను విమర్శిస్తూనే ఉన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అయినా సరే మోడీ ప్రభుత్వ తీరును ఆమె తప్పుపడుతూనే ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె ప్రశంసించిన సందర్భమే లేదు. 20 పార్టీల కూటమిని ఏర్పాటు చేసి మోడీని ఓడించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
నేరుగా మమతా బెనర్జీనే ప్రధాని పదవిపై కన్నేసి ఉంచారు. అలాంటిది.. ఇప్పుడు.. ఆమె స్వీట్లు , బట్టలు పంపుతారని… చెప్పుకుని… ఎందుకు.. మోడీ మురిసిపోతున్నారో… రాజకీయవర్గాలకు ఓ క్లారిటీ వచ్చింది. ఎన్నికల తర్వాత సీట్లు తక్కువ పడితే.. మమతా బెనర్జీని కాకా పట్టడానికి ఇప్పుటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అయితే.. బెంగాల్ లో కొన్నాళ్లుగా జరిగిన పరిణామాలతో…. బీజేపీ అంటే.. మమతా బెనర్జీ.. పీకల మీద దాకా కోపం తెచ్చుకున్నారు. మోడీ , షాల నీడ కూడా బెంగాల్ పై పడకూడదన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అలాంటిది… మళ్లీ మోడీ ప్రధాని అవడానికి మమతా బెనర్జీ సాయం సాయం చేస్తారా.. అన్నది ఆలోచించాల్సిన విషయమే.