‘మా బిల్డింగ్ కడితే.. ఆ ఖర్చంతా నేను భరిస్తా’ అంటూ ఆమధ్య మంచు విష్ణు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తనే స్థలం కూడా కొనేస్తున్నాడని తెలుస్తోంది. అంటే మా కోసం స్థలం కొని, అందులో భవనం కట్టి ఇస్తాడన్నమాట. “మా బిల్డింగ్ కోసం మూడు స్థలాలు చూశా. వాటిలో ఒకటి ఎంపిక చేసుకుందాం. అక్కడే బిల్డింగ్ కడదాం“ అంటూ విష్ణు ఇప్పుడు మరో వీడియో విడుదల చేశాడు. ఈ స్థలాన్ని తానే కొన్నాడా? లేదంటే.. అందరూ తలో చేయి వేసి కొంటున్నారా? అనేది స్పష్టం కాకోపోయినా, మా భవనం కోసం స్థలాన్ని వెదికే పని మాత్రం తానే స్వయంగా తీసుకున్నట్టు అర్థం అవుతోంది.
మా భవనం కోసం ఎప్పటి నుంచో కలలు కంటోంది సినీ పరిశ్రమ. ప్రభుత్వం ఓ అనువైన స్థలం కేటాయించి ఇస్తే, అందులో బిల్డింగ్ కట్టుకోవాలన్నది `మా` ఆకాంక్ష. భవన నిర్మాణం సమస్య కాదు. స్థలమే ప్రధాన సమస్య. ఆ స్థలం కూడా విష్ణునే ఇస్తే తిరుగే లేదు. అయితే `మా` కోసం ప్రత్యేకంగా స్థలం అవసరం లేదని, హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోనే మరో బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలం ఉందని, కొంతమంది సినీ పెద్దలు సలహా ఇస్తున్నారు. ఛాంబర్ ఆవరణలో కొంత ఖాళీ స్థలం ఉంది. `మా` భవనం అక్కడ కట్టుకుంటే.. చిత్రసీమకు చెందిన అన్ని వ్యవస్థలూ ఒకే చోట ఉన్నట్టుంటుంది. అయితే… కాస్త కూస్త స్థలంలో `మా` ఉండకూడదని, అన్ని వసతులతో ఓ భారీ భవనం నిర్మించుకోవాలని `మా` పెద్దలు భావిస్తున్నారు. విష్ణు చొరవతో అది కూడా దొరికేస్తే.. `మా భవనం` గొడవ తీరిపోయినట్టే.