గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తన తనయుడిని బరిలోకి దించాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఈ విషయం ప్రకటించిన తర్వాత… చాలా మందిలో ఆశ్చర్యం వ్యక్తమయింది. ఓ కఠిన పరీక్షనే లోకేష్ ఎదుర్కోబోతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ పొత్తుల్లో భాగంగా ఈ సీటును టీడీపీ మిత్రపక్షాలకు కేటాయిస్తూ వస్తోంది. 2014 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా గంజి చిరంజీవిని రంగంలోకి దింపింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి గంజి చిరంజీవి ఓడిపోయారు. హోరాహోరీ పోరుకు వేదిక అయిన మంగళగిరి కౌంటింగ్ సందర్భంగా ఉత్కంఠతకు తెరలేపి చర్చనీయాంశమైంది. ఈవీఎం ఓట్లలో టీడీపీ అభ్యర్థికి ఆధిక్యం వచ్చినప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్లతో మాత్రం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటపడ్డారు.
తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 66 వేల పైచిలుకు బీసీ ఓటర్లున్న మంగళగిరిలో మాత్రం తెలుగుదేశం జెండా ఎగిరింది ఒక్కసారి మాత్రమే. లోకేశ్ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా లేరు. ఈ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. మంగళగిరిలో గెలిస్తే.. అందరి అండతో విజేతగా నిలిచిన గుర్తింపు వస్తుంది. ఐటీ హబ్ గా మంగళగిరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కృషి చాలా ఉంది. ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ చొరవతో మంగళగిరి పరిధిలో చాలా ఐటీ కంపెనీలొచ్చాయి. ఐటీహబ్‌గా మంగళగిరిని తీర్చిదిద్దడంలో లోకేశ్ కృషి ఉంది. తమ ప్రాంత అభివృద్ధికి కారకుడైన మంత్రే తమ ప్రాంత ఎమ్మెల్యే అయితే మరింత అభివృద్ధి సాధించుకోవచ్చనే స్థానికుల కోరిక లోకేశ్‌కు కలిసొచ్చే మరో అంశం.
2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచీ నేటి వరకూ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ మంగళగిరి కేంద్రంగా అనేక కేసులు వేసింది. రాజధాని ఏర్పాటు తర్వాత మంగళగిరి నియోజకవర్గం సీఆర్డీఏ పరిధిలోకి రావడం, అభివృద్ధి పనులు శరవేగంగా జరగడంతో లోకేశ్ గెలుపునకు దోహదపడే మరో అంశం. మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైతే…తన ప్రాంత చేనేతలకు యువనేతగా ఆ రంగానికి చేయూతనందించే అవకాశాలున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,39,536. ఇందులో 29 వేల చేనేత వర్గం వాళ్ళు. ఎస్సీ ఓటర్లు 50వేల మందికి పైగా ఉన్నారు. యాదవ, పద్మశాలీ, గౌడ్, కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లు తరువాతి స్థానంలో ఉన్నారు.