ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు 12కు తగ్గినట్టు లెక్క. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓబీసీ, యూబీ బ్యాంకుల విలీనం ఈ చర్యల్లో అతిపెద్ది కాబోతోంది. కెనరా, సిండికేట్ బ్యాంకులు విలీనం అవుతున్నాయి. యూబీఐ, ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు విలీనం అవుతున్నాయి. అలహాబాద్ బ్యాంకులో ఇండియన్ బ్యాంకు విలీనం అవుతోంది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు బలోపేతం అవుతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతేకాదు, మొండి బకాయిలు కూడా తగ్గుతాయన్నారు.
నిజానికి, ఇన్నేసి బ్యాంకులు గతంలో ఎందుకు ఏర్పడ్డట్టు… ఆయా ప్రాంతాలకు స్థానికంగా ఉన్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా, ప్రజలకు అందుబాటులో ఉండేందుకే కదా! కానీ, బ్యాంకుల విలీనం వల్ల ప్రజలకు అందుబాటులో ఉండే బ్రాంచ్ ల సంఖ్య ఇసకసేడే తగ్గే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సేవలు అందుబాటును తగ్గించేస్తే అది అభివృద్ధి అవుతుందా..? ప్రభుత్వ ఏమంటోందంటే… కొన్ని బ్యాంకులు బాగా నష్టాల్లో ఉన్నాయీ, నడపలేని పరిస్థితుల్లో చాలా శాఖలున్నాయీ… విలీనాల వల్ల ఒక యూనిఫామిటీ వచ్చి నష్టాల శాతం తగ్గుతుందని చెబుతోంది. దాంతో బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇది వాస్తవమే, కానీ నష్ట నివారణ చర్యలంటే బ్యాంకుల్ని విలీనం చేయడం మాత్రమేనా..? నష్టం కలించినవారిపై చర్యలు ఉండవా..?
ప్రభుత్వ రంగ బ్యాంకులకు అసలైన నష్టాలు ఎక్కణ్నుంచి వస్తున్నాయీ… సామాన్య ప్రజల నుంచి కాదు, కేవలం బడా బాబులు మాత్రమే బ్యాంకుల్ని నిలువుగా ముంచేస్తున్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటివారికి వేల కోట్లలో రుణాలు ఇచ్చేసి, వారు ఐపీ పెట్టేసి దేశాన్ని వదిలి వెళ్లిపోతే… అర్రే, వెళ్లిపోయారే మాకు తెలీదే అన్నట్టు వ్యవహరించడం మానేసి, కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రదర్శించిన చిత్తశుద్ధి ఏదైనా కనిపిస్తోందా..? అలాంటి ఆసాములు ఎగ్గొట్టిన వేల కోట్లను మెడబట్టి తిరిగి కక్కించుకునేందుకు తీసుకున్న చర్యలేవీ..? ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటే.. అసలైన నష్ట నివారణ జరుగుతుంది. అంతేగానీ, నష్టపరచినవారిని అలాగే వదిలేస్తాం, నష్టాన్ని నివారించేందుకు బ్యాంకుల్ని కలిపేస్తాం, ఇదే అభివృద్ధి అని చెబుతుండటం కొంత హాస్యాస్పదంగా కనిపిస్తోంది! ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఏవో కారణాలతో విలీనాలు చేసుకుంటూ సంఖ్య తగ్గించుకుని, ఇంకో పక్క పెద్ద సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?