ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న కొద్దీ… ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టైల్ మారుస్తున్నారు. ఆయన ప్రచార వ్యూహంలో కులంతో పాటు.. కొత్తగా… తనను చంపబోతున్నారనే.. ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నరేంద్రమోడీపై చాలా కోపం ఉందని.. వారు చంపడానికి కూడా వెనుకాడరన్నట్లుగా బహిరంగసభల్లో మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే కొద్దీ.. నాయకుల మాటలు, బాడీలాంగ్వేజ్, వారి వ్యూహాలను చూస్తే… ఫలితాలపై ఓ అవగాహనకు రావొచ్చు.
కులం కార్డును అదే పనిగా వాడుతున్న మోడీ..!
మొదటి మూడు దశల ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి సంక్లిష్టంగా ఉందనే విశ్లేషణలు వచ్చాయి. తర్వాత నాలుగు దశల్లో బీజేపీ పూర్తిగా స్వీప్ చేస్తే తప్ప.. గెలుపొందే అవకాశాలు లేవని తేల్చారు. అయితే… హిందీ బెల్ట్ లో ఈ సారి స్వీప్ చేసే పరిస్థితి లేదని… బీజేపీకి కూడా అర్థమయినట్లుగా ఉంది. చాలా మంది.. బీజేపీకి గత ఎన్నికలతో పోలిస్తే వంద సీట్లు తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇంకా ఎక్కువే తగ్గుతాయని.. రాజకీయ విమర్శకులు కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి 2014 పరిస్థితి అయితే లేదని… తేలిపోతోంది. ఈ పరిస్థితి వల్లనే నరేంద్రమోడీ ప్రసంగాల్లో… బాడీ లాంగ్వేజ్‌లో అసహనం కనిపిస్తోందని అంటున్నారు. ఐదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన నరేంద్రమోడీ.. తన పాలన గురించి మాత్రం చెప్పడం లేదు. కానీ… ఎనాడూ.. మాట్లాడని కొత్త కొత్త అంశాలు చెబుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట కులం ప్రస్తావన తెచ్చారు. కులాన్ని చూపించి ఓట్లు అడిగారు. యూపీలో ఎస్పీ – బీఎస్పీ పొత్తుతో… బీజేపీకి గడ్డు పరిస్థితి ఉంది. అక్కడ కులం అనేది చాలా పవర్ ఫుల్ పాయింట్. అందుకే మోడీ.. కులం కార్డును తీసేశారు.
ఐదేళ్ల పాలన విజయాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేం..?
మోడీ ఐదేళ్ల పాలనలో తీసుకున్న కీలకమైన నిర్ణయాల గురించి మాట్లాడటం లేదు. నోట్ల రద్దు గురించి.. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మోడీ మాత్రమే కాదు.. ఏ బీజేపీ నేత కూడా.. నోట్ల రద్దు గురించి మాట్లాడటం లేదు. నల్లధనం తెచ్చాము.. ధరలు తగ్గాయి.. ఇలాంటివి చెప్పకుండా.. ఓట్లు అడుగుతున్నారు. తన విధానాలను చూపించి ఓట్లు అడగాలి. కానీ అలా చేయడం లేదు. ఇదే ఆశ్చర్యం కలిగిస్తోంది. వీటి గురించి చెప్పుకోకుండా… ఎమోషనల్ అంశాలయిన… పుల్వామా, సైనికులు, బాలాకోడ్ దాడులు, శబరిమల, అయోధ్య రాముడు.. లాంటి… అంశాలను ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్షాలను దేశద్రోహులంటున్నారు. ఐదేళ్ల పాటు పరిపాలించి… బీజేపీకి చెప్పుకోవడానికి ఇంతకన్నా…ఏమీ దొరకడ లేదా…?. తాము సాధించిన విజయాలను ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు. ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు… టీడీపీ , టీఆర్ఎస్ ఎమోషనల్ అంశాలను వాడుకున్నాయి. అయితే… రెండు చోట్లా.. తాము చేసిన పనులు కూడా ఘనంగా చెప్పుకున్నాయి. కరెంటు, రైతు బంధు సహా.. అనేక పథకాల గురించి… కేసీఆర్ గొప్పగా చెప్పుకున్నారు. పసుపు -కుంకుమ, పోలవరం, అమరావతి సహా.. అనేక అంశాలపై చంద్రబాబు చెప్పుకున్నారు. అంటే.. వాళ్లిద్దరూ.. కాన్ఫిడెంట్ గా … తాము చేసింది చెప్పుకున్నారు. కానీ.. మోడీ మాత్రం.. తాము ఐదేళ్లలో ఏం చేశామో మాత్రం చెప్పడం లేదు. అసలు చెప్పాల్సినవి చెప్పకుండా.. పాకిస్తాన్ దాకా ఎందుకు వెళ్లాల్సి వస్తోంది..?
తనను చంపుతారనే సానుభూతి డ్రామాలెందుకు..?
కాంగ్రెస్ పార్టీ తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని.. మోడీ ఆరోపించారు. ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ… ఓ సారి ఇలాంటి ఆరోపణలు చేశారు. అప్పటి ఓ ప్రధాని, ఓ మాజీ ఉపరాష్ట్రపతి, అప్పటి సైన్యాధిపతి… పాకిస్థాన్ తో కలిసి తనను చంపడానికి ప్రయత్నించాయని ఆరోపించారు. ఇది చాలా తీవ్రమైన అంశం . కానీ.. ఆరోపణ చేసి వదిలేశారు. ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. ఈ మాటలు విని.. పాకిస్థాన్ నవ్వుకుని ఉంటుంది. మన రాజకీయాలు.. మన హుందాతనాన్ని పెంచాలి కానీ.. ఇప్పుడు అలా లేదు. చాలా దిగువ స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి. అధికారం వాళ్లదే.. యంత్రాంగం అంతా వారి చేతుల్లో ఉన్నప్పుడు.. మాటలే ఎందుకు మాట్లాడుతున్నారు..? ప్రధానిపై కుట్ర పన్నిన తర్వాత ఎవరైతే ఏమిటి..? కాంగ్రెస్ అధ్యక్షుడైన సరే.. శిక్షించాలి కదా..!. ప్రధాని హత్యకు కుట్ర పన్నితే.. కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి కదా..!
ఎమర్జెన్సీకి ముందు అచ్చం ఇందిరలానే..! మోడీ కూడా అదే చేయబోతున్నారా..?
గతంలో.. ఇందిరా గాంధీ కూడా.. తాను ఓడిపోతున్నాననే… భావన వచ్చినప్పుడల్లా.. ఇందిరా గాంధీ ఇలాగే మాట్లాడేవారు. విదేశీ శక్తులతో కలిసి ప్రతిపక్ష పార్టీలు తనను అంతం చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. ఎమర్జెన్సీ పెట్టే సమయంలో.. ఇందిరా గాంధీ మాట్లాడిన ప్రతీ మాట ఇప్పుడు.. నరేంద్రమోడీ మాట్లాడుతున్నారు. అందుకే ప్రజల్లో అనుమానం ఉంది. మోడీ మళ్లీ గెలిస్తే… ఎన్నికలే ఉండవా..? ఎమర్జెన్సీ వస్తుందా..? అనేదే ఆ అనుమానం. మోడీ ప్రజాస్వామ్యం గురించి చెబుతున్నారు కానీ.. అనుమానాలు ఎందుకొస్తున్నాయంటే… ఎమర్జెన్సీ కి ముందు ఇందిరాగాంధీ చెప్పిన మాటలే చెబుతున్నారు. తనను చంపబోతున్నారు… విపక్షాలు గెలిస్తే దేశం అస్థిరం అవుతుంది.. దేశానికి ప్రమాదం పొంచి ఉంది… లాంటి మాటలు చెప్పేవారు. ఇందిర కూడా.. ప్రభుత్వ అధికారులను వాడుకుని.. ప్రచారం చేశారు. ఇప్పుడు మోడీ కూడా అదే చేస్తున్నారు. అప్పుడు ఆమె డిస్క్వాలిఫై అయ్యారు. కానీ ఇప్పుడు మోడీపై ఈగ కూడా వాలడం లేదు. అప్పట్లో ఇంది… వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి.. ఇందిర రాజకీయం చేశారు. ఇప్పుడు మోడీ అదే చేస్తున్నారు. అందుకే… ఎమర్జెన్సీ మళ్లీ వస్తుందని… ప్రజలు అనుమాన పడుతున్నారు.