అరవై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాకే దేశంలో నిజమైన అభివృద్ధి ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆ పార్టీ నేతలంతా ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే దేశాభివృద్ది కుంటుపడుతుందని , మళ్లీ బీజేపీని ఆదరించాలని ఓటర్లకు పిలుపునిస్తున్నారు.
అబద్దాలతో జనాలను బీజేపీ వంచిస్తోందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తుండగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ కుమార్ , ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, ది హిందూ వార్తాపత్రిక మాజీ ఎడిటర్ ఎన్ రామ్ ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు.
రాహుల్, మోడీలను పబ్లిక్ డిబేట్ కు ఆహ్వానించారు. ఈ డిబేట్ లో ఈ ఇద్దరు నేతలు పాల్గొనడం వలన దేశాభివృద్దికి ఏ పార్టీ ఎంత కృషి చేసిందో స్పష్టత వచ్చే అవకాశం ఉందనేది వారి ఉద్దేశం కావొచ్చు. అయితే, ఈ లేఖను అందుకున్న రాహుల్ గాంధీ ప్రధాని మోడీతో పబ్లిక్ డిబేట్ లో పాల్గొనేందుకు తాను 100 శాతం సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. మోడీ గురించి తనకు తెలుసునని, ఆయన తనతో డిబేట్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరని తెలిపారు.
ఇద్దరు మాజీ న్యాయమూర్తులు, ఓ జర్నలిస్టు మిమ్మల్ని, ప్రధానిని పబ్లిక్ డిబేట్ గా ఆహ్వానించారు.. మీరు వెళ్తున్నారా..? అని రాహుల్ ను తాజాగా ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తప్పకుండా ఆ కార్యక్రమానికి హాజరవుతా.. అని వెల్లడించారు. కానీ, మోడీ పబ్లిక్ డిబేట్ కు రావడం సందేహమేనని వ్యాఖ్యానించారు.
నిజానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ ఇంతవరకూ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనలేదు. మీడియా అంటే మోడీ జంకుతారని.. ఆ భయంతోనే ఆయన తన అనుకూల మీడియాకు తప్ప స్వతంత్రంగా వ్యవహరించే మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరని కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే పబ్లిక్ డిబేట్ కు ఆహ్వానంపై రాహుల్ స్పందించారు కానీ, మోడీ ఇంకా స్పందించకపోవడంపై కాంగ్రెస్ అదే తరహ విమర్శలు చేస్తోంది. ఎన్నికల వేల తన అసమర్ధత ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళనతోనే పబ్లిక్ డిబేట్ కు మోడీ దూరంగా ఉంటారని విమర్శిస్తున్నారు.
విదేశాల్లో మూలుగుతున్న నల్లదనం వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల జమ చేస్తానని,ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ 2014లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పబ్లిక్ డిబేట్ లో పాల్గొంటే ఆయనకు ఈ అంశాలపై ప్రశ్నలు ఎదురు కావడం ఖాయం. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఈ అంశం బీజేపీ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపతుందని మోడీ ఈ పబ్లిక్ డిబేట్ ను స్కిప్ చేస్తారనే చర్చ జరుగుతోంది.