గడచిన మూడు రోజులు… దేశంలోని అత్యంత చర్చనీయాంశాలైన మూడు కేసుల విషయమై తీర్పులు వెలువడ్డాయి. వీటిలో ప్రధానమైంది 2 జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం కేసు. దీన్లో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ కేంద్రమంత్రి రాజా, కనిమొళి నిర్దోషులుగా కోర్టు తీర్పు ఇచ్చింది. రెండోది.. ఆదర్శ్ స్కామ్. మాజీ సైనికులకు సంబంధించి ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని బయటపడ్డ కేసు విచారణ నుంచి అశోక్ చవాన్ కు విముక్తి లభించింది. ఇక, మూడోది.. గడ్డి కుంభకోణంలో ఇరుక్కున్న లాలూప్రసాద్ యాదవ్ ను అంతిమంగా దోషిగా కోర్టు తేల్చింది. నిజానికి, ఈ కేసులన్నీ వేర్వేరు సందర్భాల్లో నమోదైనవి. కానీ, వీటిపై తాజాగా వెలువడిన తీర్పులను ఒకే గాటన కట్టి ప్రతిపక్షాలతోపాటు, మీడియాలోని కొన్ని వర్గాలూ చూస్తున్నాయి.
2జీ కేసులో రాజా, కనిమొళి నిర్దోషులుగా తేలవడం వెనక భాజపా ప్రమేయం ఉందన్నట్టుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఏ కేసునైతే ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుని, కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం అని మోడీ చెప్పుకొచ్చారో… ఇప్పుడు అదే కేసును తమ రాజకీయ అవసరాల కోసం నీరుగార్చేశారు అనేట్టుగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే అవసరాన్ని మోడీ గుర్తించారనీ, అందుకే ఇటీవల ఆయన కరుణానిధిని కలుసుకున్నారనీ, ఆ తరువాత… 2జీ తీర్పు వెలువడిందంటూ ఈ వరుస పరిణామాలను రాజకీయావసరాల దారంతో ముడిపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాదన కూడా ఇదే!
ఇక, లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా తేల్చడం వెనక కూడా భాజపా ప్రమేయమే ఉందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. భాజపాను ధీటుగా ఎదుర్కొనే నేతగా లాలూకి గుర్తింపు ఉంది కాబట్టి, ఆయన్ని అణచివేయడం కోసమే తెర వెనక జరిగిన చాణక్యం ఇది అంటూ విశ్లేషిస్తున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జగన్నాథ్ మిశ్రా లాంటివాళ్లను నిర్దోషులుగా నిర్ధరించి, లాలూని మాత్రమే దోషిగా చూపడం వెనక ఉన్నది భాజపా రాజకీయమే అనే వాదన వినిపిస్తోంది. ఆర్జేడీ వర్గాలు కూడా ఇదే కోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ఒక ప్రధాన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిర్దోషులుగా బయటపడ్డా అది భాజపా ప్రమేయమే, మరో కేసులో మరొకరిని దోషులుగా కోర్టు తీర్పు ఇచ్చినా అక్కడా భాజపా ప్రమేయమే అనే కథనాలు మీడియాలో వస్తున్నాయి. నేటి కొత్తపలుకు ద్వారా ఆంధ్రజ్యోతి వినిపించిన వాణి కూడా ఇదే. ఈ తీర్పుల నేపథ్యంలో మన న్యాయ వ్యవస్థ పట్ల సామాన్యుల్లో కొంత ఆందోళన వ్యక్తం కావడం సహజం. కానీ, ఈ పరిణామాలన్నింటినీ రాజకీయ లబ్ధి కోణంలో ప్రెజెంట్ చేయడం ఎంతవరకూ సరైంది..?
డీఎంకేతో పొత్తు కోసమే 2జీ కేసు తీర్పు ఇలా వచ్చేలా భాజపా ప్రభావితం చేసిందనడానికి సాక్ష్యమేముంది..? పైగా, ఇక్కడ అసలు విషయం చాలామంది మిస్ అవుతున్నారు! గత ఎన్నికల్లో 2జీ కేసునే భాజపా ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంది కదా. ఇప్పుడు అదే కేసును వారే నీరు గార్చితే… అవినీతికి వ్యతిరేకంగా భాజపా చేస్తున్న పోరాటం ఇదేనా అనే ప్రశ్న వస్తుంది కదా. కేవలం తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఆశించి.. దాని కోసం జాతీయ స్థాయిలో పార్టీ భవిష్యత్తును భాజపా పణంగా ఎందుకు పెడుతుంది..? అయినా, ఈ తరహా ఆరోపణలకు ఆధారలేమైనా ఉన్నాయా..? మనదేశంలో కోర్టులు మరీ అంత దారుణం ఏం లేవు కదా! రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా ప్రయత్నించదు అని చెప్పడం లేదు… కానీ, దానికీ న్యాయ వ్యవస్థకీ తాజా పరిణామాలకీ లింక్ పెట్టేసి విమర్శలు చేయడం సరైంది కాదనేదే విశ్లేషకుల అభిప్రాయం.