అరుణాచల్ ప్రదేశ్ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. కనుక కేంద్రమంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర వేశారు.
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అంత వేగంగా స్పందించిన మోడీ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నప్పటికీ రాష్ట్రపతి పాలన విదించే ఆలోచన కూడా చేయడం లేదు. ఎందుకంటే అక్కడ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి)తో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశగా ఎదురుచూస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మరణించేవరకు పిడిపి, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలో ఉండేది. ఆయన మరణించిన తరువాత ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి బీజేపీ సిద్దమయినప్పటికీ, ఆమె మాత్రం బీజేపీ పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. తన తండ్రి మరణం కారణంగా శోకంలో ఉన్నారనే సాకుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో తాత్కాలికంగా ఆ రాష్ట్రాన్ని గవర్నర్ పాలనలోకి తీసుకువచ్చేరు. డిశంబర్ 6న ముఫ్తీ మహమ్మద్ సయీద్ చనిపోగా, ఇంతవరకు జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పడనే లేదు. అత్యంత కీలకమయిన సరిహద్దు రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దంగా ఉన్నప్పటికీ, పిడిపి-బీజేపీల మధ్య బేరసారాలు కుదరకపోవడంతో ఆ రాష్ట్రం ఇంకా గవర్నర్ పాలనలోనే ఉంచబడింది తప్ప అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోలాగ రాష్ట్రపతి పాలన విధించలేదు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసేతర రాష్ట్రాలలో ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలద్రోసేందుకు ఇటువంటి ప్రయత్నాలే చేసేది. ఇప్పుడు బీజేపీ కూడా అరుణాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా కూల్చివేసి రాష్ట్రపతి పాలన తెచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ముఖ్యమంత్రి నబం తుకి ప్రభుత్వాన్ని కూల్చివేసి, తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి ప్రయత్నించింది. అందుకోసం అది ఆ రాష్ట్ర గవర్నర్ సేవలని ఉపయోగించుకొంది. కానీ గౌహతి కోర్టు తప్పు పట్టడంతో వెనక్కి తగ్గవలసివచ్చింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషను దాఖలు అవడంతో రాష్ట్రపతి పాలన విధించి చేతులు దులుపుకొంది.
అక్కడి ఎమ్మెల్యేలతో తిరుగుబాటు, తదనంతర రాజకీయ పరిణామాలతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని బీజేపీ అనలేదు. ఎందుకంటే చాలా కాలంగా ఈశాన్య రాష్ట్రాల మీద కన్ను వేసిన బీజేపీ ప్రోత్సాహం లేకుండా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారంటే నమ్మలేము. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ముందు స్పీకర్ ని, ఆ తరువాత ముఖ్యమంత్రి నబం తుకి ప్రభుత్వాన్ని కూల్చివేయడం, ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటుకి ప్రయత్నించడం వంటివన్నీ ఈ వ్యవహారంలో బీజేపీ పాత్రని నిర్ధారిస్తున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని భావించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా విధించడానికి మాత్రం వెనుకాడుతోంది. ఒకవేళ మహబూబా ముఫ్తీ బీజేపీతో కాకుండా కాంగ్రెస్ లేదా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దమయితే అప్పుడు అక్కడ కూడా రాష్ట్రపతి పాలన విధిస్తుందేమో?
డిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సచివాలయంపై సీబీఐ దాడులు, బెంగాల్లో మమత బెనర్జీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు శారద చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపిల అరెస్ట్ వంటివన్నీ మోడీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలలోనే నడుస్తోందని చెప్పడానికి చక్కటి ఉదాహారణలు. చాలా భారీ అంచనాలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, కేవలం ఏడాదిన్నర కాలంలోనే నిత్యం తాము విమర్శించే కాంగ్రెస్ అడుగుజాడలలో నడక మొదలుపెట్టడమంటే ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరిస్తున్నట్లుగానే భావించవచ్చును లేకుంటే ఇటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయవలసిన అవసరమే ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలలోనే నడిస్తే చివరకు బీజేపీకి కూడా ఏదో ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టిన డుస్థితే ఎదురవవచ్చును.