తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తుల అంశం కీలకంగా మారింది. మహాకూటమిలో టీడీపీ చేరడంతో .. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తేమిటన్న విమర్శలు కొన్ని వైపుల నుంచి వస్తున్నాయి. అయితే.. దీనికి వాదనగా.. చంద్రబాబు.. తాము.. కాంగ్రెస్తో కలవాలనుకోలేదని… టీఆర్ఎస్తోనే కలసి పోటీ చేద్దామనకున్నాని.. కానీ మోడీ వచ్చి… మధ్యలో గొడవలు పెట్టడం వల్లనే తమ మధ్య స్నేహం చెడిపోయిందని చెబుతున్నారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మోడీ వల్లనే.. మహాకూటమిలో కాంగ్రెస్తో భాగం కావాల్సి వచ్చిందని చెప్పుకొస్తున్నారు.
టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులు పెట్టుకోవాలనుకున్నాయా..?
నిజానికి తెలంగాణలో.. టీఆర్ఎస్తో టీడీపీ పోరాడుతోంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ.. టీఆర్ఎస్తో కలిసి వెళ్లిన దాఖలాలు కూడా లేవు. అయినా.. చంద్రబాబు.. టీఆర్ఎస్తో వెళదామనుకున్నాం.. కానీ మోడీ వచ్చి అగ్గిపుల్ల పెట్టాడు అని చెబుతున్నారు. అలా ఎందుకు చెబుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే.. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే.. అవును కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నాం అని నేరుగా చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తర్వాత.. మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలనుకోలేదు.. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం .. కానీ మోడీ వల్ల పెట్టుకోలేదని చెప్పడం వల్ల.. వచ్చే రాజకీయ లాభం ఏమిటో ఎవరికీ అర్థం కావడంలేదు. అలాగే.. గతంలో.. టీడీపీ – టీఆర్ఎస్ కలుస్తాయన్న ప్రచారం జరిగింది. అలాంటి వాతారవణం కూడా ఏర్పడింది. గతంలో అమరావతి శంకుస్థాపన సమయంలో.. మోడీతో పాటు.. ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి నడుచుకుంటూ వెళ్లడం చూశాం. సరే అది అధికారిక కార్యక్రమం అనుకుందాం. కానీ తర్వాత యాగానికి పిలిచేందుకు… కేసీఆర్.. అమరావతి వెళ్లారు. ఆ వెళ్లడం కూడా.. ఎలా ఉంది. ఓప్రత్యేకమైన బృందంతో వెళ్లారు. రెండు, మూడు గంటలు కూర్చున్నారు. భోజనాలు చేసి చర్చలు జరిపి వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు దొంగ అంటున్నారు. టీడీపీతో పొత్తులు ఎలా పెట్టుకుటామని చెబుతున్నారు..?
ఢిల్లీలో కాంగ్రెస్ రావాలని కేసీఆర్ కోరుకుంటాడా..?
అదీ కాక.. కేసీఆర్.. మూడో ఫ్రంట్ కోసం.. దేశం మొత్తం తిరిగినప్పుడు… ఓ సందర్భంలో చంద్రబాబును కలిస్తారా అని మీడియా అడిగితే.. కచ్చితంగా కలుస్తాను.. చంద్రబాబు నా మిత్రుడని చెప్పుకొచ్చారు. ఇది ఆన్లైన్ లో కూడా ఉంది. ఈ మిత్రుడు కాస్తా ఇప్పుడు ఎందుకు మారారు. ఓ దశలో.. టీడీపీ, టీఆర్ఎస్ కలవాలనుకున్నది మాత్రం నిజం. అయితే.. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దీనికి మోడీ ఎంత కారణం అన్నది చెప్పలేం. టీడీపీ అయినా… టీఆర్ఎస్ అయినా… బీజేపీ అయినా.. తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా.. వ్యూహాలు పన్నుతూంటాయి. దీనికి బీజేపీ, మోడీ కారణం అయినా తప్పు పట్టేదేమీ లేదు. చంద్రబాబు కూడా బీజేపీతో కలిశారు కదా. తర్వాత బయటకు వచ్చేశారు. అంత మాత్రాన.. బీజేపీతో కలిసే వాళ్లంతా తప్పు చేస్తున్నట్లు కాదుగా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని బీజేపీ వంద శాతం కోరుకుంటుంది. ఇందులో అనుమానం ఏముంటుంది..?. కాంగ్రెస్ బలపడాలని ఏమీ కోరుకోదు కదా..!. తెలంగాణలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా.. బలంగా టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్తో మైత్రిని బీజేపీకి కోరుకుంటోంది. దీనికి చంద్రబాబు బాధపడాల్సిన పని లేదు. మోడీ అంత ప్రమాదకరమైతే.. చంద్రబాబు ఎందుకు నాలుగేళ్లు కలిసి ఉన్నారు..?.
రాజకీయ అవసరాల కోసమే పొత్తులు, స్నేహాలు..!
కేసీఆర్ కూడా కచ్చితంగా తన రాజకీయ అవసరాల కోసమే… బీజేపీతో దోస్తీ చేస్తున్నాడు. ఆయన రాజకీయ అవసరాలేమిటి..? ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభావం హైదరాబాద్లో ఉండదా..?. దేశం మొత్తం కాంగ్రెస్ ప్రభంజనం వస్తే.. అది తెలంగాణపై కూడా పడుంది. కేసీఆర్ దేశంలో రావొద్దని కోరుకుంటాడు. అందుకే బీజేపీతో… స్నేహం చేస్తాడు. ఇందులో రాజకీయమే తప్ప.. కేవలం మోడీ పుల్ల పెడితే… కేసీఆర్ బోల్తా పడిపోయి… టీడీపీతో మైత్రి వదిలేసుకున్నారనుకోవడం పొరపాటు. ఎవరు పుల్ల పెడితే.. చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి బయటకు వచ్చారు..?. టీడీపీ, బీజేపీ కలిసినప్పుడు… విడిపోయినప్పుడు.. రాజకీయ వ్యూహమే. కానీ చంద్రబాబు మాత్రం.. తాను మోడీని దొంగ అంటున్నాడు.. కాబట్టి.. అందరూ దొంగ అనాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు అంటే.. కేసీఆర్ ఎందుకు అనాలి..? ఎవరి రాజకీయం వారిది..!