దాసరి తరవాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. నేనున్నా… అని చిరంజీవి ముందుకొచ్చినా… ఆ మోజు, ఆ వేడి త్వరగానే తగ్గిపోయింది. నేను ఇండస్ట్రీ పెద్దను కాదు. ఆ పెద్దరికం నాకొద్దు, నేను పంచాయితీలు చేయను… అని చిరు బాహాటంగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడైతే చిరంజీవి నోటి నుంచి ఈ మాట బయటకు వచ్చిందో, చాలామంది `పెద్దరికం` తల పై వేసుకుని మోయడానికి రెడీ అయిపోయారు. చిరు స్టేట్మెంట్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే… పరిశ్రమని ఉద్దేశించి మోహన్‌బాబు ఓ లేఖ రాశారు. పరిశ్రమ అంతా ఒకే మాటపై ఉండాలని, ప్రభుత్వ పెద్దల్ని కలిసి, సమస్యని పరిష్కరించుకోవాలని, ఈ విషయంపై జగన్ కి ఓ లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు.
ఆ తరవాత రాంగోపాల్ వర్మ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వరుస ట్వీట్లతో వేడి పుట్టించాడు. దానికి మంత్రులూ స్పందించారు. వారి మధ్య వాడీ వేడీ చర్చ సాగింది. ఆఖరికి మంత్రితో మాట్లాడడానికి వర్మకు పిలుపొచ్చింది. దాంతో పరిశ్రమకు వర్మ రూపంలో పెదరాయుడు దొరికేశాడని అనుకున్నారంతా. వర్మతో చర్చలలో పెద్దగా మేటర్ లేదని, ఇవన్నీ ఊసుపోని కబుర్లని ఆ తరవాత తేలిపోయింది.
ఇప్పుడు బంతి చిరంజీవి చేతికి వచ్చింది. ఇండస్ట్రీ పెద్దను కాను… అని అన్న తరవాతే, చిరుకి జగన్ నుంచి పిలుపొచ్చింది. ఎప్పటి నుంచో ఎంతో బతిమాలుతున్నా దొరకని అప్పాయింట్ మెంట్.. ఇప్పుడు ఏరి కోరి ఎదురొచ్చింది. దాంతో ఇండస్ట్రీ పెద్ద.. చిరంజీవినే అనే సంకేతాలు ప్రభుత్వమే పంపినట్టైంది. ఈ చర్చలు సజావుగా జరిగాయా, దీని ఫలితం ఏమిటి? అనేది పక్కన పెడితే, పరిశ్రమకు చిరునే పెదరాయుడు అనేది అర్థమైంది.
మరి మోహన్ బాబు తదుపరి అడుగు ఎటు? అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే చిరు వద్దన్న పెద్దన్న పోస్టుని తన దగ్గరే ఉంచుకుని, దాసరి శిష్యుడిగా ఆయన వారసత్వం కొనసాగించాలనుకున్నాడాయన. అందుకే ఈమధ్య సీరియస్‌గా ఓ ఉత్తరం రాశారు. జగన్ ని కలవాలని, పరిశ్రమ తరపున బాధలు చెప్పుకోవాలని, అలా.. చిత్రసీమలో పెదరాయుడు పాత్ర పోషించాలని అనుకున్నారు మోహన్ బాబు. చిరు – జగన్‌ల తాజా భేటీతో ఆ కల కలగానే మిగిలిపోయింది. అయితే మోహన్ బాబు అంత తేలిగ్గా వెనుకంజ వేసేరకం కాదు. ఆయన దగ్గర ఏదో ఓ వ్యూహం ఉండే ఉంటుంది. వీలైనంత త్వరలో జగన్ ని వ్యక్తిగతంగా కలవాలన్నది ఆయన ఆలోచన. జగన్ తనకు బంధువు కాబట్టి.. ఆ రూపంలో అయినా, ఒకసారి కలిసి వచ్చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. జగన్ అప్పాయింట్ మెంట్ కూడా మోహన్ బాబుకి దొరికిందని, త్వరలోనే ఈ భేటీ కూడా జరగబోదోందని ఓ టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.