తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర హోంశాఖ షాక్ లాంటి వార్త ఇచ్చింది. అదేంటో కాదు.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్.. ఐఎస్ కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి.. నేరుగా పార్లమెంట్లోనే తెలియచేశారు. దక్షిణాదిలో ఐఎస్ వ్యవహారాలు చాపకింద నీరులా సాగుతున్నాయని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి ఐఎస్ లో చేరేందుకు కేరళ యువకులు పెద్ద ఎత్తున వెళ్తున్నారన్న ప్రచారం ఉంది. కొంత మందిని పట్టుకున్నారు కూడా. కొంత మంది హైదరాబాద్ యువకులు కూడా అలాంటి ప్రయత్నాలు చేశారని గతంలో వార్తలొచ్చాయి. కొంత మందిని పట్టుకున్నారు. కానీ .. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా పెద్దగా అలజడి లేదు.
అయితే కేంద్రం విశ్వసనీయ సమాచారం మేరకే.. ఇలా ప్రత్యేకంగా తెలంగాణతో పాటు ఏపీ గురించి కూడా చెప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో కులాల రాజకీయాలు ఉన్నాయి కానీ.. ఇలా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల పట్ల ఆకర్షితులయ్యేంత భారీ మత భావనలు ఉంటాయని ఎవరూ అనుకోవడం లేదు. అయితే.. కిషన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం.. ప్రస్తుతం ఏపీలో అలాంటి ధోరణులు కూడా ఉన్నాయని అనుమానించక తప్పదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫలానా వారు ఐఎస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంత వరకూ పెద్దగా బయటపడలేదు. కానీ ఏదో సమాచారం లేకపోతే.. కిషన్ రెడ్డి అలా అధికారిక సమాచారం చెప్పే అవకాశం లేదంటున్నారు.
ప్రపంచానికి ఇస్లామిక్ స్టేట్ ప్రమాదకరంగా మారింది. అల్ ఖైదా పతనం తర్వాత ఇస్లామిక్ స్టేట్ తెరపైకి వచ్చంది. అనేకానేక విధ్వసంసాలను సృష్టించింది. ఈ సంస్థ తమ భావజాలానికి అనుగుణం.. ప్రపంచవ్యాప్తంగా రిక్రూట్మెంట్లు చేసుకుంటుంది. ఇంటర్నెట్ ద్వారా సాగిపోయే ఈ వ్యవహారంపై కొంత మంది యువత ఆకర్షితులవుతున్నారు. భారత్ నుంచి కూడా ఇలా ఆకర్షితులవుతున్న యువత సంఖ్య ఎక్కువగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండటమే ఆందోళన కరంగా కనిపిస్తోంది.