కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంనుప్రభుత్వం కమ్యూనిస్టుగా పరిగణిస్తున్నదా? మరో రెండు రోజులకు ఆయన తలపెట్టిన పాదయాత్ర సందర్భంగా సిపిఎం సిపిఐ నాయకులకు కూడా ముందస్తుగా నోటీసులివ్వడం వల్ల ఈ సందేహం కలుగుతుంది. తెలుగుదేశం మినహా తక్కిన అన్ని పక్షాల నాయకులకు నోటీసులిస్తున్నారు. ముద్రగడ జగన్ సలహా మేరకే ఇదంతా చేస్తున్నాడని ప్రభుత్వం ఆరోపిస్తున్నది గనక ఎలాగూ వైసీపీ నాయకులకు నోటీసులు వెళుతున్నాయి.
ఆ పార్టీ నేత జక్కంపూడి విజయలక్ష్మికి నోటీసులిచ్చిన పోలీసులు ఆకుల వీర్రాజు అనే మరో నాయకుడు రాజమహేంద్రవరంలో అందుబాటులో లేనందున వెనుతిరిగిపోయారు. మరోవైపున పట్టణంలోని సిపిఎం కార్యాలయంలోకి వెళ్లి టి.అరుణ్‌కు నోటీసు ఇచ్చారు.ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు గనక దాంట్లో పాల్గొంటే నేరంగా చూస్తామని హెచ్చరించారట. సిపిఐ కార్యాలయానికి కూడా వెళ్లినా వారు ఏదో ధర్నా కార్యక్రమంలో వుండి అందుబాటులోకి రాలేదట. ఇదంతా అప్రజాస్వామికంగా వుందని సిపిఐ నాయకులు విమర్శించారు. పాదయాత్రకు మద్దతు తెలిపిన వారికే నోటీసులు ఇచ్చామని ఎస్పి బి. రాజకుమారి చెప్పగా తాము అలాటి ప్రకటనేదీ చేయలేదని సిపిఎం నేత అరుణ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మద్దతు తెల్పినంత మాత్రాన మహాపరాధమై పోతుందా? ముద్రగడ కమ్యూనిస్టు అవుతారా? ఆ మాటకొస్తే ఈ ఆందోళనకు మూలకారణమైన రిజర్వేషన్ల వాగ్దానం చేసిన చంద్రబాబు కూడా బాధ్యత వహించాలి కదా? మరి ఆ పార్టీకి ఎందుకు నోటీసులివ్వలేదు? ఇదంతా అసహనానికి అద్దం పట్టే వ్యవహారం. అంతే.