జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తమ తల్లిగారికి అవమానం జరిగిందని తెలిసిందనీ, ఆ విషయమై తనకు ఎంతో బాధ కలిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడుని తమ భుజాలపై మోశారనీ, పవన్ వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ముద్రగడ అన్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం తాను దీక్ష చేస్తుంటే తనను కూడా అవమానించారన్నారు. తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకూ 24 గంటలూ పోరాటం చేయండి అంటూ పవన్ కి సూచించారు. ఒక మెట్టు దిగి అన్ని వర్గాలనూ కలుపుని వెళ్లాలని ముద్రగడ చెప్పారు. పవన్ రోడ్డు మీదికి రావాలనీ, టీడీపీని నిమజ్జనం చేసేవరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ లేఖ చూశాక పవన్ కి ముద్రగడ మద్దతు ప్రకటించినట్టు భావించవచ్చా అంటే… ఆ మాట ఒక్కటే ముద్రగడ చెప్పడం లేదు! ఓ పదిరోజుల కిందట మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే, జనసేనకి తాను మద్దతు ఇచ్చేదీ లేనిదీ ఆలోచిస్తానని ముద్రగడ అన్నారు. ఆ వెంటనే… పవన్ ముఖ్యమంత్రి అయితే కాపు సామాజిక వర్గానికి చాలా మేలు జరుగుతుందనీ, కాపు సామాజిక వర్గీయులందరూ ఆయనకి మద్దతు తెలిపితే ఇది సాధ్యమౌతుందనీ ముద్రగడే వ్యాఖ్యానించారు. అక్కడికి మరో మూడు రోజుల తరువాత… సినిమావాళ్లు రాజకీయాల్లో నెగ్గడం చాలా అరుదనీ, అది ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైందన్నారు. పవన్ కల్యాణ్ భాజపా అనే మహా వృక్షం నీడలో ఉన్నారనీ, దాన్నుంచీ బయటకి వస్తే తప్ప ఎదగలేరన్నారు. తమ జాతి ప్రయోజనాల కోసం ఎవరైతే పాటు పడతారో వారికే మద్దుతు ఇస్తామని చెప్పారు.
ఇంతకీ… పవన్ కి మద్దతు ప్రకటించే విషయంలో ముద్రగడ ఎందుకింత గందరగోళానికి గురౌతున్నారు..! తమ జాతి ప్రయోజనాలను కాపాడేది పవన్ కల్యాణే అన్నట్టుగా కాసేపు మాట్లాడతారు. కాస్తలోనే, పవన్ పనితీరుపై అనుమానాలు ఉన్నట్టు స్పందిస్తుంటారు. ఏదైమేనా, జనసేనకు ముద్రగడ మద్దతు ఉందనేది ఇప్పటికే చాలామంది నుంచి వినిపిస్తున్న టాక్. ఆ మధ్య కొంతమంది జనసేన ప్రతినిధులు తన దగ్గరకి వచ్చారనీ, కొన్ని సలహాలు తీసుకున్నారనీ ముద్రగడే చెప్పారు. అలాంటప్పుడు ఈ దోబూచులాట ఎందుకు…? లేదంటే… తనపై ఒక సామాజిక వర్గం ముద్ర పడుతుందేమో అనే అనుమానంలో పవన్ కల్యాణే ముద్రగడని అంటీ ముట్టనట్టు, అవసరం అనుకున్నప్పుడు చూడొచ్చులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా..?