దానం నాగేందర్‌ను పార్టీ నుంచి వెళ్లకుండా నిలువరించలేకపోయారన్న విమర్శలను మోస్తున్న.. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఇప్పుడు ముఖేష్‌గౌడ్ టెన్షన్ పట్టుకుంది. పుట్టిన రోజు వేడుకలను… అనుచరులందర్నీ పిలిపించి.. అత్యాంత గ్రాండ్‌గా చేసుకున్న ముఖేష్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్నట్లుగా ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీని గట్టిగా సమర్థించారు. అంజన్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో పని చేస్తానని ప్రకటించారు. ప్రకటనల పరంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి ముఖేష్ గౌడ్ వీరవిధేయత ప్రకటించారని చెప్పుకోవాలి.
కానీ చేతల్లో మాత్రం ఇది కనిపించడం లేదు. కొద్ది రోజులుగా ముఖేష్గౌడ్తో పాటు ఆయన కుమారుడు విక్రంగౌడ్ కూడా.. పార్టీ తరపున సమావేశాలు హాజరు కావడం లేదు. తమను ఎందుకు ఆహ్వానించడం లేదని… విక్రమ్‌గౌడ్ పీసీసీపైనే ఆరోపణలు చేశారు. దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరినప్పుడు.. ముఖేష్ గౌడ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఎందుకో వారు ఆగిపోయారు. కానీ ప్రచారం మాత్రం ఆగలేదు. ఎప్పుడూ లేని విధంగా అనుచరుల సమవేశాన్ని పుట్టిన రోజు వేడుకల పేరుతో ఏర్పాటు చేశారు. దాంతో అభిప్రాయసేకరణ అనే అందరూ అనుకున్నారు. ఈ వేడుకలకు అనూహ్యంగా.. టీఆర్ఎస్ గ్రేటర్ చీఫ్ మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ముఖేష్‌కు కేక్ తినిపించి.. గంట సేపు రహస్యంగా మంతనాలు జరిపి వెళ్లారు.
దీంతో బయటకు ఏం చెప్పినా.. మైనంపల్లితో చర్చలు.. టీఆర్ఎస్ హైకమండ్‌కు చేరి.. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దానం నాగేందర్ ఇంటికి వెళ్లినట్లు.. హుటాహుటిన.. ముఖేష్ గౌడ్ ఇంటికి వెళ్లారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి… కాసేపు పార్టీ మారవద్దని సలహాలిచ్చారు. గాంధీభవన్‌లో మాట్లాడుకుందామని ఆహ్వానించి వెళ్లారు.
ముఖేష్ గౌడ్ స్పందనేమిటనేది.. వారం, పది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మైనంపల్లికి ముఖేష్ చెప్పిన కోరికల చిట్టాకు టీఆర్ఎస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనే దానిపై.. ముఖేష్ నిర్ణయం ఆధారపడి ఉండవచ్చు. ఆయన కొంచెం పెద్ద డిమాండ్లే పెట్టి ఉంటారని..వాటిని టీఆర్ఎస్ అంగీకరించడం కష్టం కాబట్టే.. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి అనుకలమైన వ్యాఖ్యలే చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో నేతల మాటలకు అర్థాలే వేరు. ఈ విషయాన్ని ముఖేష్ కూడా నిజం చేస్తారేమో చూడాలి..!