‘గీత గోవిందం’తో మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడని అనుకునే లోపల ‘శైలజారెడ్డి అల్లుడు’ పాటలతో సందేహాలు కలిగిస్తున్నాడు. పాటల్లో గీత గోవిందానికి, శైలజారెడ్డి అల్లుడికి స్పష్టమైన తేడా కనపడుతోంది. దీనంతటకీ ముఖ్య కారణం… ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాట అని చెప్పుకోవాలేమో! ఎందుకంటే… యూట్యూబ్లో విడుదల కావడమే ఆలస్యం వెంటనే జనాలకు నచ్చేసింది. ఆ పాట ఇన్స్టంట్ హిట్! ‘గీత గోవిందం’ నుంచి తరవాత విడుదలైన ‘ఏంటీ… ఏంటీ’ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే… ‘గీత గోవిందం’ విజయంలో సంగీతం ముఖ్య భూమిక పోషించింది. నిజానికి, ‘గీత గోవిందం’ కంటే ముందు తెలుగులో గోపీసుందర్ సంగీతం అందించిన అరడజను సినిమాలు, అందులోని పాటలూ జనాలకు నచ్చలేదు. ‘మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు’, ‘ఊపిరి’, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలతో వచ్చిన పేరుకి మచ్చ పడింది. దాన్ని ఒక్క ‘గీత గోవిందం’తో తుడిచేశాడు గోపీసుందర్. దాంతో అతడి సంగీతంపై అంచనాలు పెరిగాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ పాటలు ఆ అంచనాలను అందుకుంటాయా? లేదా? అనే సందేహం కలుగుతోంది. ఇప్పటి వరకూ ఇందులోని రెండు పాటలు విడుదల అయ్యాయి. రెండూ అంతంత మాత్రమే. ‘ఇంకేం ఇంకేం కావాలే’ స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో సంగీత దర్శకుడి అభిమానలకు నిరాశ తప్పడం లేదు. ఈ రోజు ‘శైలజారెడ్డి అల్లుడు’లోని రెండో పాట ‘శైలజారెడ్డి అల్లుడు సూడే’ పాట విడుదలైంది. ఇందులో అత్త (రమ్యకృష్ణ), భార్య (అనూ ఇమ్మాన్యుయేల్) మధ్య నలిగిపోయే భర్త (నాగచైతన్య) కష్టాలను వివరించారు. పాట బాలేదని కాదు. కానీ, ‘గీత గోవిందం’ పాటలతో పోలికలు వస్తుండటమే అసలు సమస్య.