తెలంగాణ కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. అంతర్గత కలహాలు, వ్యక్తిగత అజెండాలు, పదవుల రేసులను కాస్త పక్కన పెట్టి, అధికారం సాధించాలన్న ఒకే అజెండాతో నాయకులు బస్సు ఎక్కబోతున్నారు. అయితే, ఈ సందర్భంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు రెండు ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మొదటిది.. తనతో విభేదాలున్న నాయకుల్ని కలుపుకుంటూ యాత్రలో భాగస్వామ్యం చేసి, యాత్రను విజయవంతం చేయడం. వ్యక్తిగతంగా ఈ విజయం ఆయనకు అవసరం కదా. రెండోది.. యాత్రలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేసుకుంటూ పోవడం. అయితే, అధిష్టానం ఆదేశాల మేరకు నాయకులంతా కలిసికట్టుగానే యాత్రకు సిద్ధమౌతున్నారు. ఇంకోపక్క ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకునే అంశంపై కూడా పార్టీలో బాగానే కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా, భాజపా టీడీపీల నుంచి కొంతమంది నేతలు ఈ బస్సు యాత్ర సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, గజ్వేల్ లో కేసీఆర్ మీద పోటీ చేసి ఓడిన ప్రతాప్ రెడ్డి, అన్నపూర్ణమ్మ వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖంగా వినిస్తున్నది… భాజపా నాయకుడు నాగం జనార్థన రెడ్డి పేరు..! ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. భాజపాలో చేరిన దగ్గర నుంచీ అక్కడ గుర్తింపు లేక ఇమడలేకపోతున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి చేరిన సమయంలోనే ఆయనా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఉగాది వరకూ ఆగుతాననీ, ఈలోగా భాజపా నుంచి స్పష్టమైన కార్యాచరణ రాకపోతే పార్టీ మార్పు గురించి ఆలోచిస్తానని ఆ మధ్య అన్నారు.
నాగం విధించిన డెడ్ లైన్ ను భాజపా సీరియస్ గా తీసుకుంటుందా చెప్పండీ…? అయినా సరే, ఆయన్ని బుజ్జగించేందుకు కొంతమంది భాజపా నేతలు ఈ మధ్యనే ప్రయత్నించారు! కానీ, కేసీఆర్ ను వెనకేసుకొచ్చే కార్యక్రమాలు తగ్గించుకోకపోతే తెలంగాణలో భాజపాకు మనుగడ ఉండదంటూ వారికి ఉల్టా క్లాస్ తీసుకుని మరీ నాగం పంపేశారు. దీంతో ఉగాది వరకూ ఆయన ఆగినా… భాజపా అధిష్టానం నుంచి కొత్తగా వచ్చే స్పందన ఏదీ ఉండదనేది అప్పుడే స్పష్టమైపోయింది. దీంతో కాంగ్రెస్ లో ఆయన చేరిక దాదాపు ఖరారు అయిపోయింది. ఇటీవలే నాగం ఢిల్లీ వెళ్లి, రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. దీంతో తెలంగాణ నేతల బస్సు యాత్ర ప్రారంభానికి ముందే నాగం పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ నేత హోదాలో నాగం యాత్ర బస్సు ఎక్కేసే అవకాశం ఉన్నట్టే..!