రీమేక్ సినిమాలు తీయడం చాలా సులభం అనుకుంటారంతా. కథలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. వీలైతే ట్యూన్స్ ని వాడుకోవొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నీ… దించేసుకోవొచ్చు. కాబట్టి పని తక్కువ. అందుకే రీమేక్‌లపై గురి పెడుతుంటారంతా. అయితే.. అది అంత ఈజీ కాదు. మాతృకలోని ఆత్మ ని పసిగట్టకపోతే… రీమేక్ కాస్తా.. మేకై కూర్చుంటుంది. రీమేక్ అంటే జిరాక్స్ లానో, కాపీ పేస్ట్ లానో ఉండకూడదు. మనదైన కథ ని చెబుతున్నట్టే అనిపించాలి. అలా అనిపించిన కథలే వర్కవుట్ అవుతాయి. తాజాగా వెంకీ నుంచి వస్తున్న మరో రీమేక్ `నారప్ప`. ఈనెల 20న అమేజాన్ లో వస్తోంది. ట్రైలర్ ని ఈరోజు విడుదల చేశారు. `అసురన్` చూడని వాళ్లకు.. `నారప్ప` ట్రైలర్ తప్పకుండా నచ్చుతుంది. వెంకీలోని ఎమోషన్, కనిపిస్తున్న విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టిపడేస్తాయి.
`అసురన్` చూసినవాళ్లకు మాత్రం.. ఇది కచ్చితంగా కార్బన్ కాపీలానే అనిపిస్తే.. అదేం విచిత్రం కాదు. ఎందుకంటే `అసురన్`లో కనిపించే చాలా షాట్స్.. మక్కీకి మక్కీ దించేసినట్టు `నారప్ప` ట్రైలర్లో స్పష్టం అవుతోంది. కెమెరా మూమెంట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ `అసురన్`లోంచే దిగుమతి చేసేసుకున్నారు. ఒకట్రెండు పాత్రలకు నటీనటుల్ని కూడా అక్కడి నుంచే తీసుకొచ్చారు. ఎందుకంటే.. తమిళంలో వాడుకున్న సీన్లు యధాతథంగా, రీషూట్ చేయకుండా వాడేసుకోవొచ్చని. దాంతో ఖర్చు, సమయం రెండూ ఆదా అవుతాయి.
దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలకు కొత్తగా ఆలోచించే స్కోప్ `నారప్ప` ఇవ్వలేదనిపిస్తోంది. కొన్ని కథల్లో మార్పులు చేర్పులూ చేయకపోవడమే మంచిది. ఏ సన్నివేశాన్ని మార్చాలనుకున్నా అందులోని ఎమోషన్ మిస్ చేసినట్టే అవుతుంది. వెంకీ స్వతహాగా భారీ ప్రయోగాలకు ఒప్పుకోడు. తన జర్నీ ఎప్పుడూ సేఫ్ సైడే. నిర్మాతగా సురేష్ బాబు కూడా అదే ఆలోచిస్తాడు. కాబట్టి… మార్పులు, చేర్పులకూ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదేమో అని స్పష్టం అవుతోంది.