భాగ్యనగరంలో రాజకీయ ముసుగులో ఉన్న అరాచక శక్తుల విపరీత పోకడలకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ప్రథమపౌరుడి కోర్టులోకి చేరింది. గవర్నర్ నరసింహన్ ఈ విషయంలో ఎంత మాత్రం స్పందిస్తారు అనే విషయంలో.. నిన్న ఆయనను కలిసి నివేదించిన విపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ.. గవర్నర్ మాత్రం దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ప్రతిపక్షాల ఫిర్యాదు మీద గవర్నర్ స్పందించారు. అసలు జరిగిందేమిటో తన శైలిలో తెలుసుకోవడానికి ఆయన నగర కమిషనర్‌ను పురమాయించారు. పోలీసు కమిషనర్ ఆనంద్ , ఇవాళ గవర్నర్‌ను కలిసి పాతబస్తీ పరిణామాలపై తన నివేదికను ఇవ్వనున్నారు.
మజ్లిస్ దాడులపై కాంగ్రెస్, తెదేపా, భాజపా, వైకాపా, పార్టీలు బుధవారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రోద్బలం, అలుసుతోనే మజ్లిస్ పార్టీ ఇలా దుందుడుకు దాడులకు పాల్పడినదంటూ ఈ సమావేశంలో పాల్గొన్న దాదాపుగా అన్ని పార్టీలూ విమర్శలు కురిపించడం విశేషం. సమావేశం ముగిసిన తర్వాత.. అఖిలపక్షానికి చెందిన నాయకులు వెళ్లి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మజ్లిస్ ఆగడాలను అరికట్టే ప్రయత్నం చేయాలని, అవసరమైతే సెక్షన్ 8ను కూడా అమల్లోకి తీసుకురావాలని నాయకులు గవర్నర్‌ను కోరారు. అయితే గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత ఆయన నిర్లిప్తంగా వ్యవహరించినట్లుగా కొందరు నేతలు అభిప్రాయం వెల్లడించడం విశేషం. వారు ఎలా పేర్కొన్నప్పటికీ.. గవర్నర్ మాత్రం చురుగ్గానే స్పందించారు. అసలు జరుగుతున్నదేమిటో తనకు తెలియజేయాలంటూ నగర కమిషనర్‌ను ఆదేశించారు.
అయితే గవర్నర్ మజ్లిస్ ఆగడాల గురించి కమిషనర్ ద్వారా తెలుసుకున్న తర్వాత.. ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా ఉంది. అఖిలపక్షం వారు విన్నవిస్తే- విన్నట్లుగా.. ఏదో కమిషనర్‌ను కూడా పిలిచి వివరాలు తెలుసుకుని అక్కడితే ఊరుకుండిపోతారా? లేదా, రాష్ట్ర ప్రథమపౌరుడిగా, గవర్నర్‌గా తనకున్న విస్తృతాధికారాలను, విచక్షణాధికారాలను ఉపయోగించి.. ఇలాంటి దుడుకు దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేలా ఏమైనా నిర్ణయాన్ని వెలువరిస్తారా? అనేది ఆసక్తికరమైన అంశం.
గతంలో ఇలా పలుమార్లు వివిధ అంశాల విషయంలో గవర్నర్‌కు విపక్షాలు చేసిన నివేదనలన్నీ వృథాగానే పోయాయి. ఇప్పుడు కూడా ఆయన పట్టించుకుంటారా? లేదా? అని అంతా అనుకున్నారు. అయితే.. ప్రస్తుత మజ్లిస్ దాడులను విపక్షాలు ఇక్కడితో విడిచిపెట్టడం లేదు. రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోంశాఖకు కూడా నివేదించబోతున్నాయి. ఎటూ రేపు అయినా సరే.. సమస్య మరింత సీరియస్ రూపం సంతరించుకోబోతున్నది గనుక.. గవర్నర్ ముందే తాను స్పందించినట్లుగా.. కమిషనర్‌ను పిలిపించినట్లు పలువురు భావిస్తున్నారు. మరి ఆయన ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో వేచిచూడాలి.