గత ఎన్నికల్లో అంతా మోడీ హవా..! ఆయన ప్రధాని అయితే చాలు అభివృద్ధి జరిగిపోతుందన్న ప్రచారం భారీ ఎత్తున చేసింది భాజపా. అభివృద్ధి అంటే మోడీ, మోడీకి పర్యాయ పదం అభివృద్ధి అనే స్థాయిలో ఇమేజ్ తీసుకొచ్చారు! కానీ, 2019 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రజలకు ఒక విషయం చాలా స్పష్టమౌతోంది. అదేంటంటే… మోడీ మాటల్లో ఉంటే అభివృద్ధి చేతల్లో కనిపించడం లేదనేది! అందుకే, రాబోయే ఎన్నికల్లో మోడీ ఒక్క కటౌట్ తో ప్రచారం చేసే కంటే… ఇతర మార్గాలను కూడా అనుసరించాలని భాజపా డిసైడ్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో ఆ పార్టీ ప్రచారం చేస్తున్న తీరే దీనికి నిదర్శనం.
ఆ రాష్ట్రంలో ఇప్పుడు ప్రచారమంతా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు మీదే ఎక్కువగా జరుగుతోంది. తాజాగా ‘సమృద్ధ మధ్యప్రదేశ్.. మేరా సుఝావ్, మేరా చునావ్’ అంటూ ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 50 హైటెక్ వాహనాలను దీని కోసం సిద్ధం చేశారు! ఈ వాహనాలు రాష్ట్రంలోని 230 నియోజక వర్గాల్లో తిరుగుతాయి. ఇంతకీ ఈ కార్యక్రమం ఏంటంటే… ఏం చేస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనే సలహాలూ సూచనల్ని ప్రజల నుంచి కోరడం! ఈ వాహనాలు రాష్ట్రంలోని కాలేజీలు, కాలనీలు, గ్రామాలు… ఇలా అన్ని చోట్లకీ వెళ్లి, అక్కడి ప్రజలతో చర్చా వేదికలు పెడతాయి. అభివృద్ధి సలహాలను ప్రజల నుంచి నేరుగా స్వీకరిస్తారు. దీంతోపాటు సోషల్ మీడియా ద్వారా కూడా సలహాల స్వీకరణకు భాజపా రంగం సిద్ధం చేసింది. ఫోన్ కాల్స్ ద్వారా భాజపాకి సలహాలు ఇచ్చే ఏర్పాటూ చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా చాలా స్పష్టమౌతున్న విషయం ఏంటంటే… మోడీ ఉంటే చాలు అభివృద్ధి అంటూ గత ఎన్నికల్లో ప్రచారం చేసిన భాజపా, ఇప్పుడు ప్రజల నుంచే ప్రణాళికలూ ఆలోచనలూ అడుగుతూ ఉండటం! పార్టీ తరఫున ఉండాల్సిన అభివృద్ధి ఆలోచనల్ని ప్రజల నుంచి ఆహ్వానిస్తున్నారు. ఇంకోటి, ఈ కార్యక్రమాలకు సిద్ధమైన వాహనాలపై కూడా ప్రముఖంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఫొటోలే ఉన్నాయి. మోడీకి ప్రాధాన్యత తగ్గించారు! నిజానికి, 2014 తరువాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ప్రచారంలో ఎక్కడ చూసినా మోడీ కటౌట్లే కనిపించేవి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులూ కనిపించేవారు కాదు. అలాంటిది… మధ్యప్రదేశ్ ఎన్నికలకు వచ్చే సరికి మోడీ హవా తిరోగమన దశకు వచ్చిందనేది స్పష్టమౌతోంది. అభివృద్ధి ప్రణాళికలు భాజపా దగ్గర లేవని, ప్రజలే సలహాలు ఇవ్వాలనే స్థాయికి ప్రచారం తీరు మారింది.