ఇప్పటి వరకూ ఎవరూ చేయలేని అద్భుతాన్ని నరేంద్ర మోదీ చేసి చూపించబోతున్నారు. సోనియాగాంధీ జీవితకాల స్వప్నాన్ని నరేంద్రమోదీనే తీర్చబోతున్నారు. ఇంతకీ అదేమిటనుకున్నారు.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం. సోషల్ మీడియాలో ఈ తరహా జోకులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇందులో అతిశయం ఏమీ లేదు. రాహుల్ గాందీ ఎప్పటికీ ప్రధాని కాలేరు అన్న నోళ్లే ఇప్పుడు… ఆయన తర్వాతి ప్రధాని అంటున్నాయి. ఈ పని చేసి పెట్టేది .. నరేంద్రమోదీ అనే చెబుతున్నాయి. పదేళ్ల కాంగ్రెస్ పాలనపై వ్యతిరేక కన్నా ఎక్కువ.. నరేంద్రమోదీ నాలుగేళ్ల పాలనలో తెచ్చిపెట్టుకున్నారు మరి. ఈ వ్యతిరేకత నుంచే.. రాహుల్ గాంధీపై సానుకూలత పెరిగిపోయింది. ఒకప్పుడు రాహుల్ ప్రసంగాన్ని తప్పు పట్టిన వాళ్లు ఇప్పుడు… పొగుడుతున్నారు. మోదీకి సరైన కౌంటర్ ఇచ్చారని విశ్లేషణలు చేస్తున్నారు. నిజానికి సరిగ్గా గమనిస్తే..రాహుల్ ప్రసంగాల్లో కానీ.. వ్యవహారశైలిలో కానీ అప్పుడూ .. ఇప్పుడూ ఎలాంటి మార్పులు రాలేదు. కానీ ప్రజల్లో వచ్చింది.. నరేంద్రమోదీపై వచ్చిన కోపంతో.. రాహుల్ పై వచ్చిన సానుకూలతే.
గొప్ప హైప్‌తో వచ్చిన సినిమాలు ఎంత బాగా ఉన్నా.. అంచనాలను అందుకోలేవు. అట్టర్ ఫ్లాపవుతూంటాయి. ఇప్పుడు నరేంద్రమోదీ సినిమా కూడా అంతే. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోదీని.. ఓ రక్షకుడిగా ప్రొజెక్ట్ చేశారు. గెలిచిన తర్వాత కూడా.. ఆ ప్రచారంలో ఏ మాత్రం తేడా రానీయలేదు. కానీ…రెండేళ్లు..మూడేళ్లు గడిచేసరికి… ఆయనపై ఉన్న అంచనాలన్నీ తేలిపోవడం ప్రారంభించాయి. భారీ హైప్‌కి తగ్గట్లుగా ఆయన పనితీరు లేదు. నిజానికి మోదీ ఎంత చేసినా.. ఆయనపై ఉన్న హోప్స్‌ని రీచ్ అవడం కష్టమే. అలాంటిది.. ఆయన ఏమీ సాధించలేకపోతే… సానుకూలత ఎక్కడ్నుంచి వస్తుంది. అందుకే నరేంద్రమోదీ సినిమా ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ ముంగిట నిలిచింది. ఈ పరిస్థితి రాహుల్ గాంధీ బాక్సాఫీస్‌కి కళ తీసుకొస్తోంది. మోదీ కంటే.. రాహుల్ అత్యుత్తమం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గతంలో రాహుల్ గాంధీని పప్పు అని పిలిచేందుకు పోటీ పడేవాళ్లు. కానీ ఇప్పుడెవరూ.. చివరికి బీజేపీ నేతలు కూడా.. రాహుల్‌ని అలా పిలవలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే… రాహుల్ వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో… తొలి రోజు రాహుల్ జాతీయను టార్గెట్ చేసిన మోదీ.. ఆ తర్వాత నుంచి సైలెంటయిపోయారు.
ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో ప్రచారం చేసినా..ఓడిపోవడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఆయనది ఐరన్ లెగ్గని.. కాంగ్రెస్ పార్టీ నేతలే విమర్శించారు. గుజరాత్ ఎన్నికల దగ్గర్నుంచి పరిస్థితి మారిపోయింది. గుజరాత్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీనికి రాహుల్‌ను ఎవరూ నిందించలేదు. పైగా.. కాంగ్రెస్ గెలుపొందినట్లు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు కర్ణాటక నుంచి కాంగ్రెస్ గెలుపు బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో గెలుపు ఖాయం అయినట్లే. డిసెంబర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలకు ఎన్నికలకు జరుగుతాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు మెరుగైన అవకాశాలున్నాయి. అన్నింటిలనూ గెలుచుకుంటూ వస్తే.. గత ఎన్నికల్లో మోదీకి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఈ సారి రాహుల్‌కు అంతే క్రేజ్ వస్తుంది. అంటే.. ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయన్న మాట.