వందేళ్లలో ఎప్పుడూ లేనంత ప్రళయం కేరళను చుట్టుముట్టింది. కేరళ పడుతున్న బాధను చూసి.. ప్రపంచం అంతా కదిలింది. గల్ఫ్ దేశాల అధినేతలూ… తమ వంతు సాయం అందిస్తున్నారు. కేరళకు అండగా ఉండాలనే విషయంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలకు ఎలాంటి బేదాభిప్రాయాలు లేవు. అందరూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఎక్కువ చేస్తున్నారా..? తక్కువ చేస్తున్నారా అని ఎవరూ చూడటం లేదు. ఒక్క కేంద్రప్రభుత్వం విషయంలలో మాత్రం దీనికి మినహాయింపు.
సమాఖ్య ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కేరళపై అత్యంత తీవ్రంగా వివక్ష చూపిస్తోందన్న విమర్శలు చాలా ఘాటుగా వస్తున్నాయి. దానికి కారణం…. జాతీయ విపత్తు లాంటి కేరళ వరదల్ని ప్రధాని నరేంద్రమోడీ చేలా తేలికగా తీసుకోడమే కాదు… ఆర్థిక సాయం కూడా అంతే తేలికగా చేశారు. ఇప్పటికిప్పుడు… నిరాశ్రయులైన ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టడానికి… కూడా వందల కోట్ల ఖర్చవుతాయన్న పరిస్థితి ఉంది. అయినా మోడీ… రూ. 500 కోట్ల సాయం మాత్రమే ప్రకటించారు. నిజానికి కేరళ ప్రభుత్వం… ప్రధాని మోడీ ముందు … మొత్తం జరిగిన నష్టాన్ని ఉంచింది. ప్రజలను.. ఇంకా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు… వారందర్నీఆదుకోవడానికి… రూ. 2500 కోట్లు తక్షణ సాయంగా ప్రకటించాలని… పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ ప్రధాని మోడీ మాత్రం.. అన్నీ సీరియస్ గా విని వెళ్లేటప్పుడు.. రూ. 500 కోట్లు ప్రకటించి వెళ్లారు. దీంతో కేరళ ప్రభుత్వం కూడా.. ఏ మాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదు. పైగా ప్రధాని ఎదుటే నిరసన తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ ఔదార్యం ఇంత కన్నా గొప్పగా ఏమీ ఉండదన్న విమర్శలు చాలా రోజులుగా వస్తున్నాయి. రాజకీయంగా… బీజేపీకి ఏ మాత్రం బలం లేకపోవడంతో పాటు… తాము చెప్పినట్లు ఆడే పార్టీలు ఉండటంతో బీజేపీ ఇలా వ్యవహరిస్తోందన్న ప్రచారం కూడా ఉంది. ఇలా ప్రచారం జరగడం వల్ల.. తమకు కొత్తగా పోయేదేమీ లేదన్నట్లు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సహజసిద్ధంగా ఉత్తరాది రాష్ట్రాలకు భూరి సాయం ప్రకటిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తోంది. ఫళితంగా…. మోడీ తీరు… వాజ్పేయి చెప్పినట్లు.. రాజధర్మాన్ని ఉల్లంఘిస్తున్నట్లే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.