ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నవాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి, అధికారంలో ఉన్నవాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవ్వరూ విమర్శించకూడదు, అలా విమర్శించిన వాళ్ళందరూ రాక్షసులు, నరకాసురులు, అభివృద్ధి నిరోధకులు…. ఫైనల్‌గా అసలు మనిషి జాతే కాదు అన్నంతవరకూ ఆ విమర్శల జోరు వినిపించడంలో అందరిదీ ఒకే అభిప్రాయం. మీడియా వాళ్ళు కావొచ్చు, ప్రతిపక్ష నాయకులు కావొచ్చు, సమాజ అభివృద్ధికోసం పాటుపడే స్వచ్ఛంధ సంస్థలు, మేధావులు కావొచ్చు….ఎవ్వరైనా సరే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు భజన చేస్తేనే మంచి వాళ్ళన్నట్టు, లేకపోతే అసలు మనుషులే కాదన్నట్టు. అవసరమైతే మాటలతో బెదిరిస్తారు. మాట వినకపోతే అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమదైన శైలిలో విమర్శకుల నోళ్ళు మూయిస్తారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఉన్న పాలకులకు ఇంతటి నియంతృత్వపు ఆలోచనలు ఎలా వచ్చాయి? ప్రప్రథమ ప్రధానమంత్రి నెహ్రూవారు నేర్పించిన విద్య అదే కాబట్టి అన్నది వాస్తవం. స్వాతంత్ర్య పోరాటంతో పాటు రాజ్యాంగ రూపకల్పనలోనూ పాలుపంచుకున్న జవహర్లాల్ నెహ్రూకి అసలు మంత్రిమండలిపైన విశ్వాసమే లేదు. ఆ విషయం ఆయనగారు గాంధీజీకి వ్రాసిన లేఖల ద్వారానే తెలుస్తోంది. పరిస్థితులను బట్టి వ్యవహరించే పూర్తి స్వేచ్ఛ ప్రధానికి ఉండాలి అన్న నెహ్రూ అభిప్రాయం మంత్రిమండలి వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తోంది. నెహ్రూకు ఉన్న ఈ అభిప్రాయాన్నే ఆ తర్వాత కాలంలో మన పాలకులందరూ ఫాలో అయ్యారా అని అనిపిస్తోంది. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీతో సహా ఇప్పుడున్న ప్రధాని నరేంద్రమోడీ, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా తమకు ఎదురు మాట్లాడని వారిని, తాము చెప్పిన ప్రతి మాటకు మౌనంగా తలూపేవారిని, ఎప్పటికీ కూడా తమకు పోటీదారులు కాలేని అసమర్ధులనే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహారశైలిని చూస్తే చాలు. ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ లాంటి వాళ్ళు మాత్రం ఇందుకు మినహాయింపు. అయితే ఆయనగారు సోనియాగాంధీ దగ్గర ఎలా ఉండేవారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది కూడా ఇదే పద్ధతి. హోం మినిస్టర్‌గా సబితా ఇంద్రారెడ్డిని నియమించినప్పుడు అందరూ కూడా మహిళకు హోం మినిస్టర్ ఇచ్చాడని వైఎస్‌ని కీర్తించారు. కానీ అసలు విషయమైతే తను చెప్పిన మాటకు సబితా ఇంద్రారెడ్డి ఎదురుచెప్పదు అన్న నమ్మకమే. ఒకరనేంటి….? మన పాలకులు, ప్రతిపక్షనాయకులు అందరిదీ ఇదే విధానం. ఒక్క సారి కుర్చీ ఎక్కగానే…. మేం అనుకున్నది, మాకు నచ్చింది, మేం చేసుకుంటూ పోతాం. ఎవ్వరూ ఎదురుచెప్పొద్దు, విమర్శలు చెయ్యొద్దు అన్న నియంతృత్వపు సిద్ధాంతాన్ని ఫాలో అవ్వని నాయకులు మన దేశం మొత్తం మీద కూడా ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదేమో. అలా ఆనాటి పాలకులు నాటిన విషబీజాలు భారతదేశ ప్రజలందరినీ ఈ నాటికీ పట్టిపీడిస్తూనే ఉన్నాయి.
మంత్రివర్గ సహచరులు, ప్రతిపక్ష సభ్యులు, మీడియావారు, మేధావులు…..ఇలా ఏ ఒక్కరు విమర్శించినా సహించలేని, భరించలేని మన పాలకులు ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు. మన నాయకులకు మనస్సాక్షి అనేదే ఉండదు, చెప్పే మాటలకు, చేతలకు అస్సలు సంబంధమే ఉండదు అని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వేరే ఏదైనా కావాలా?