నితిన్ ఓ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడు. భీష్మతో తనకు ఓ చక్కటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మళ్లీ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావడం తరువాయి. ఇలా ప్రకటించిన వెంటనే… అలా పట్టాలెక్కించేయాలని నితిన్ భావిస్తున్నాడట. అంతే కాదు.. ఈ యేడాదే ఈ సినిమాని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట.
అయితే… అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం వక్కంతం వంశీ సినిమాని పట్టాలెక్కించాడు నితిన్. ఈ సినిమాకి `జూనియర్` అనే టైటిల్ కూడా పెట్టారని ప్రచారం సాగింది. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొన్నారు. ఆ తరవాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చి, వెంకీ సినిమాని త్వరగా పూర్తి చేయాలన్న నితిన్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొత్త అనుమానాలకు తావు ఇస్తోంది. గతేడాది వేసవిలో వక్కంతం వంశీ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అయితే.. షూటింగ్ మాత్రం సజావుగా సాగలేదు. మధ్యలో చాలా బ్రేక్‌లు వచ్చాయి. వక్కంతం సెకండాఫ్ ని ఇంకా సిద్ధం చేయలేదని, కథలో డౌట్లు ఉన్నాయని, అందుకే రీ రైట్ చేయడానికి నితిన్ మరింత సమయం ఇచ్చాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరోవైపు.. వంశీనే కావాలని సమయం తీసుకొంటున్నాడని, ఓ పట్టాన స్క్రిప్టు పూర్తి చేయడం లేదన్న వార్తలూ వస్తున్నాయి. వంశీ స్వతహాగా రచయిత. కాబట్టి.. ఆమాత్రం చాదస్తం ఉంటుంది. పైగా.. దర్శకుడిగా తన తొలి సినిమా `నా పేరు సూర్య` పరాజయం పాలైంది. రెండో సినిమాకీ అదే తప్పు చేస్తే.. దర్శకుడిగా తన దారులు మూసుకుపోయినట్టే. అందుకే.. రెండో సినిమా విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు. చక చక సినిమాలు చేసేయాలన్న ఉద్దేశంతో ఉన్న నితిన్.. వంశీని పక్కన పెట్టి.. వెంకీతో సెట్ అయ్యాడు. మరి వక్కంతం పరిస్థితేంటో ?