ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రా పర్యటన రద్దయిన సంగతి తెలిసిందే! కానీ, దీన్ని ‘వాయిదా’ అంటున్నారు రాష్ట్ర భాజపా నేతలు. వాయిదా అంటే ఓ నాలుగైదు రోజులు ఉంటుందిగానీ, ఏకంగా నలభై రోజులంటే… దాన్ని కచ్చితంగా ‘రద్దు’ అనే అంటారు. వాయిదా అనుకుంటే… ఆరో తేదీన కేరళ పర్యటన కూడా రద్దు కావాలి కదా! కారణాలు భాజపా నేతలు ఎన్ని చెప్పుకున్నా… ఆంధ్రాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు రాలేని పరిస్థితి రాజకీయంగా ఉత్పన్నమైందనడంలో సందేహం లేదు. దీన్ని ఏపీ భాజపా నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాలి. మరీ ముఖ్యంగా దీనిపై ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఇంకేంటారో మరి..?
ఆంధ్రా పర్యటనకు మోడీ వస్తున్నారంటూ ఏపీ భాజపా నేతలు కొంత హడావుడి ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుంటూరు సభకు కనీసం రెండు లక్షల మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సొంత గడ్డపై ప్రధాని సభ అనేసరికి, దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకున్నారు. అయితే, ప్రధాని రావడం లేదనడంతో ఈ ఏర్పాట్లన్నీ నీరుగారే పరిస్థితి. రాజకీయంగా కూడా ప్రధాని పర్యటన రద్దు కావడం ఏపీ భాజపా నేతల దూకుడుకి కొన్నాళ్లపాటు కళ్లం వేసి వెనక్కి లాగినట్టే అవుతుంది.
ప్రధాని రాష్ట్రానికి వస్తే, ఆయనతో టీడీపీ సర్కారుపై విమర్శలు చేయించేసి, ఆంధ్రాకి ఇంకా చేయాల్సిందే లేదనీ, అనుకున్నదానికి మించి చాలా చేసేశామని చెప్పించాలని సహజంగా అనుకుని ఉంటారు. ప్రధాని సభ తరువాత అదే ఊపుని కొనసాగించాలని అనుకుంటారు. అయితే, పర్యటన రద్దు కావడంతో… ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి గతంలో మాదిరిగా విమర్శలు చేస్తే, అభాసుపాలు కాక తప్పదు. ప్రధాని రాష్ట్రానికి వచ్చేంత వరకూ భాజపా నేతలు కొంత సందిగ్ధంలో ఉండక తప్పదు.
వాస్తవానికి, ఏపీలో ప్రధాని పర్యటన అనగానే నిరసనలు వ్యక్తమయ్యే పరిస్థితికి ఓరకంగా రాష్ట్ర భాజపా నేతలూ కారణమే. ఎందుకంటే, రాష్ట్రానికి ఏమీ చెయ్యని కేంద్రాన్ని పదేపదే వెనకేసుకొస్తూ… అధికార పార్టీని విమర్శలు చేస్తూ ఉండటం వల్ల రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయ వేడిని పెంచి పోషిస్తూ వచ్చారు. రాష్ట్రంలో ప్రజల నుంచి వ్యక్తమౌతున్న ఆవేదనను తగ్గించే ప్రయత్నంగానీ, ఇక్కడి ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలంటూ కేంద్రానికి సలహా ఇచ్చిన సందర్భంగానీ రాష్ట్ర భాజపా నేతల చరిత్రలో లేదు. కేవలం భాజపా ప్రతినిధులుగా మాత్రమే వ్యవహరిస్తున్నారే తప్ప, ఏపీకి చెందిన నాయకులు అన్నట్టుగా వారి తీరు ఏ సందర్భంలోనూ కనిపించలేదు. ప్రధాని పర్యటన అనగానే రాష్ట్రంలో నిరసన వాతావరణం పెరగడం వెనక ఇదీ ఒక కారణం అనడంలో సందేహం లేదు.