ఈ సంక్రాంతికి బాక్సాఫీసు ముందుకు దూసుకొస్తున్నాడు ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ సినిమాకి గట్టి పోటీ ఉంది. రజనీకాంత్, అల్లు అర్జున్‌ల చిత్రాలూ ఇదే సీజన్లో వస్తున్నాయి. కాబట్టి.. ప్రచారాన్ని ఇది వరకటి కంటే ముమ్మరంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ‘సరిలేరు’ టీమ్ కూడా అందుకు అనుగుణంగానే సిద్ధమైంది. ‘సరిలేరు..’ ప్రీ రిలీజ్ వేడుకని ఇదివరకెప్పుడూ లేనంత ఆడంబరంగా చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందని సమాచారం. జనవరి మొదటి వారంలో జరిగే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఓ స్టార్ హీరో కనిపించనున్నాడని తెలుస్తోంది.
మహర్షి ప్రీ రిలీజ్‌కి ఎన్టీఆర్ వచ్చాడు. ఎన్టీఆర్ మహేష్ గురించీ, మహేష్ ఎన్టీఆర్ గురించీ ఒకే వేదికపై మాట్లాడుకోవడం – అభిమానులందరికీ బాగా నచ్చింది. ఈ సంప్రదాయాన్ని ఆ తరవాత కొన్ని సినిమాలు కొనసాగించాయి కూడా. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌కి కూడా ఎన్టీఆర్‌ని తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. మహేష్ పిలిస్తే ఎన్టీఆర్ కాదనడు. కాకపోతే ఒక్కటే సమస్య. ఇదే సీజన్లో కల్యాణ్ రామ్ సినిమా ‘ఎంత మంచి వాడవురా’ విడుదల అవుతోంది. అన్న సినిమాకి తోడుగా ఉండాల్సిన అవసరం ఎన్టీఆర్‌కి ఉంది. `రెండు సినిమాలూ బాగా ఆడాలి` అని ఎన్టీఆర్ వేదికపై స్పీచులిస్తే సరిపోతుంది. కానీ.. ఎన్టీఆర్ ఆ పని చేస్తాడా, లేదంటే అన్న సినిమాకే పరిమితమైపోతాడా? అన్నది చూడాలి.