ఎన్టీఆర్ యాంకర్ అనగానే తెలుగునాట బిగ్ బాస్ షోకి పాపులారిటీ మొదలైపోయింది. ఈ కార్యక్రమం ఎలా ఉంటుందో అంటూ… అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్వాహకులు కూడా ఈ షోని భారీ ఎత్తున తీర్చిదిద్దబోతున్నారు. ఈ ఒక్క షోకి రూ.45 కోట్ల బడ్జెట్ కేటాయించారంటే, బిగ్ బాస్ స్థాయిని అర్థం చేసుకోవొచ్చు. అయితే… బిగ్ బాస్ నిర్వహణ అంత తేలికైన విషయం కాదు. ఎన్టీఆర్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయినా… ఈ షోలో పోటీపడేవాళ్లకూ కాస్తో కూస్తో ఇమేజ్ ఉండాల్సిందే. బాలీవుడ్లో సల్మాన్ షోకీ, తమిళ నాట కమల్ షోకీ పోటీ దారుల్లో చాలామంది పాపులర్ నటీనటులే ఉన్నారు. తెలుగులో ఆ స్థాయి వాళ్లు ఎవ్వరూ కనిపించడం లేదు. దాంతో ఈ షో ఎలా సాగుతుందా?? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
షోలో డ్రామా పండాలన్నా, తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి కలగాలన్నా… వివాదాస్పద వ్యక్తులు షోలో కనిపించాల్సిందే. అలాంటి వాళ్లు తెలుగులో దొరకడం లేదని తెలుస్తోంది. అంతేకాదు.. ఇటీవల తమిళ బిగ్ బాస్ టెలీకాస్ట్ అయ్యింది. ఈ షో చూసి అందరూ నోరెళ్లబెట్టారు. కార్యక్రమంలో కొత్తదనం లేదని తేల్చేశారు. కమల్‌హాసన్ కూడా ఈ షోని సరిగా నిర్వహించలేకపోయాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమల్ లాంటి వాడికే.. సాధ్యం కాలేదంటే ఇక ఎన్టీఆర్ ఏం చేస్తాడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్టీఆర్ మంచి నటుడే కాదు.. గొప్ప మాటకారి కూడా. షోని సక్రమంగా నిర్వహించే సత్తా ఎన్టీఆర్‌లో ఉందనడంలో ఎలాంటి సందేహాలూ లేవు. కాకపోతే.. పోటీదారులెవరన్నది తేలాలి. అప్పుడే ఈ షోకి ఓ మజా వస్తుంది. తెలుగులో ఇటీవల చిరంజీవి నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడుకి యావరేజ్ రేటింగులు వచ్చాయి. చిరంజీవి కి ఉన్న చరిష్మా గురించి వేరే చెప్పనవసరం లేదు. చిరు కే రేటింగులు లేవు… ఎన్టీఆర్ కి వస్తాయా? అనే సందేహాలూ నెలకొంటున్నాయి. పైగా ఇది భారీ ప్రాజెక్ట్. బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలు తెలుగు నాట మరీ కొత్త. ఇన్ని ప్రతికూలతల మధ్య.. ఎన్టీఆర్ ఈ షోని ముందుకు ఎలా నడిపిస్తాడో చూడాలి.