తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హతా వేటును.. హైకోర్టు సమర్థించింది. ఈ అంశంపై జూన్ 14న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విభిన్న తీర్పులు వెలువరించింది. దీంతో దీనిపై తుది తీర్పును మూడో న్యాయమూర్తికి అప్పగించారు. జులై 21 నుంచి కేసు విచారణ జరిపిన మూడో న్యాయమూర్తి సత్యనారాయణ ఆగస్టు 31వ తేదీన తీర్పును వాయిదా వేశారు. ఇవాళ ప్రకటించారు. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సరైనదేనని న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నట్లయింది.
తీర్పు … అనర్హతా వేటుకు వ్యతిరేకంగా వస్తుందని… దినకరన్ వారినందర్నీ ఇప్పటికే రిసార్టుకు తరలించారు. మరికొందరు కూడా తనతో వస్తారని… ప్రభుత్వం ఉండదన్నట్లుగా ఆయన ప్రకటనలు చేశారు. చివరకు హైకోర్టు తీర్పుతో దినకరన్‌కు షాక్ తగిలినట్లయింది. ఉన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలలేదని… దీన్నొక అనుభవంగా పరిగణిస్తున్నట్టు దినకరన్ ప్రకటించారు. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తానన్నారు. తాత్కాలికంగా…, పళనిస్వామికి ఊరట లభించినప్పటికీ.. ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు..మరికొంత మంది ఎమ్మెల్యేలు బాహాటంగా పళనిస్వామిని వ్యతిరేకిస్తున్నారు. సినీ హాస్యనటుడు కరుణాస్ కొద్ది రోజుల నుంచి పళనిస్వామికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన శశికళను కూడా కలిశారు. కరుణాస్ తో పాటు అమరో ముగ్గురు ఎమ్మెల్యేలు… దినకరన్‌తో టచ్‌లోఉన్నారు. వీరి నలుగురిపైనా ఏ క్షణమైనా స్పీకర్ ధన్ పాల్ వేటు వేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
తమిళనాడు ప్రభుత్వ పరిస్థితి … దిన దిన గండంగా మారుతోంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో… ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయి.. ప్రభుత్వం బయటపడుతుంది కానీ.. రేపు.. ఉపఎన్నికల్లో ఆ స్థానాల్లో… డీఎంకే విజయం సాధిస్తే.. మొదటికే మోసం వస్తుంది. 235 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో అనర్హతా వేటు తర్వాత అన్నాడీఎంకే 116 మంది ఉన్నారు. వీరిలో కొంత మంది తిరుగుబాటు దారిలో ఉన్నారు. డీఎంకే నేతృత్వంలోని విపక్షానికి 98 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 20 స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఇరవై స్థానాల్లో డీఎంకే గెలిస్తే… సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది.