తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి.. ఆ పార్టీ అగ్రనేతలకే అర్థం కాకుండా ఉంది. ఉన్న సీట్లు వస్తాయో రావో తెలియడం లేదు. అలా అని కేసీఆర్కు సహకరించకుండా ఉండలేని పరిస్థితి. లోక్ సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ అవసరం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ను టచ్ చేసి చేయనట్లుగా వ్యవహారం నడుపుతోంది. కానీ ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. అసెంబ్లీ ఎన్నికల విషయంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. అందుకే… ఓ అతి పెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతోంది. అదే పరిపూర్ణానందను బీజేపీ తరపున తరుపుముక్కగా వాడుకోవడం.
శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. సోమవారం ఢిల్లీకి రావలసిందిగా స్వామి పరిపూర్ణానందకు కమల దళాధిపతి అమిత్ షా ఆహ్వానం పంపారు. దీంతో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. స్వామిజీ బీజేపీలో చేరడం ఖాయమేనని.. తెలంగాణ బీజేపీకి ఆయన సేవలు ఉపయోగించుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ ప్రవేశంపై స్వామి పరిపూర్ణానంద గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరే విషయమై తన నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానన్నారు. తన జీవితంలో ఏ నిర్ణయమైనా అమ్మవారిదే అన్న ఆయన.. దేశం, ధర్మం కోసం పని చేస్తానని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆహ్వానిస్తే గనుక నిస్వార్థంగా దేశం, ధర్మం కోసం పని చేస్తానన్నారు. తాజా ఆహ్వానం .. ఆయన బీజేపీలో చేరికకు మార్గం సుగమం అవుతోంది.
తెలంగాణలో చాలా రోజులుగా తెర వెనుక రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు పరిపూర్ణానంద. గతంలో… ముస్లింలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండు చోట్ల సభలు పెట్టి… వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపై కేసులు నమోదయ్యాయి కూడా. రాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో పరిపూర్ణానంద దాన్ని రాజకీయంగా ఎస్టాబ్లిష్ అవడానికి బాగా ఉపయోగించుకున్నారు. పాత కేసులను చూపించి ఆయనను హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు. కోర్టుకు వెళ్లి స్టే ఎత్తివేయించుకోవడంతో.. గత నెలలోనే ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. అప్పుడే ఆయన రాజకీయంగా చాలా పెద్ద స్కేచ్చే వేసుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడదని నిజమవుతున్నట్లుగానే ఉంది.