ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండా నడుస్తోంది. అదే ప్రత్యేకహోదా. ప్రత్యేకహోదా చాంపియన్లం మేమంటే..మేమని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తరచూ ప్రకటించుకుంటూ ఉంటారు. నేను సభలు నిర్వహించానని… పవన్ కల్యాణ్ తనను తాను ఓపెనర్‌గా ప్రకటించుకుంటారు. తను చేసిన ఆమరణ నిరాహారదీక్షల లెక్కలను జగన్ బయటకు తీస్తారు. అంత ఎందుకు… పాదయాత్ర ప్రారంభించే ముందు కూడా… ప్రత్యేకహోదా సాధన పేరుతో.. యువభేరి నిర్వహించారు. అంటే.. వీరిద్దరి అజెండా ప్రత్యేకహోదా సాధనే. అందులో ఎలాంటి సందేహం లేదు.
ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తారా..?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తే.. ఏపీ ఓ సింగపూర్..మరో అమెరికా.. ఏపీలోని ప్రతి పట్టణం.. హైదరాబాద్ అవుతుందని.. జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు చెప్పారు. ఇంచు మించు… పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారు. నిన్నటికి నిన్న చెన్నై వెళ్లి ఏపీ ప్రత్యేక హోదా సాధనే తన జీవితాశమన్నట్లుగా.. తమిళ యూట్యూట్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పుకొచ్చారు. అలాంటిది.. ఇప్పుడు.. ఏపీకి ప్రత్యేకహోదా వచ్చే మార్గం.. ఒక్కటే కళ్ల ఎదురుగా కనిపిస్తోంది. అదే కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుత అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఇక.. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కూటమి కాంగ్రెస్ పార్టీ కూటమే. కాంగ్రెస్, బీజేపీ లేకుండా.. మూడో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. ఈ రెండు పార్టీల్లో ఏదో ఓ పార్టీ మద్దతివ్వాలి. బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వనంటోంది కాబట్టి.. ఆ పార్టీకి మద్దతిచ్చినా ప్రయోజనం ఉండదు. ఇక మిగిలింది కాంగ్రెస్సే. మరి పవన్, జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు..?
ఏపీలో కాకపోయినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతివ్వలేరా..?
రాజకీయాలు కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలనే ముఖ్యమనుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి జగన్, పవన్ ఉన్న పళంగా మద్దతు ప్రకటించాలి. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ… ఇటలీ వెళ్లి ప్రవాసభారతీయులతో సమావేశమైనా… అందులో తెలుగువాళ్లుంటారన్న ఉద్దేశంతో.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెబుతున్నారు. చివరికి తెలంగాణ గడ్డపై… కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చ గొడుతున్న సమయంలో కూడా.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బహిరంగసభ వేదికగా ప్రకటింంచారు. అదే సమయంలో బీజేపీ ఇవ్వనంటోంది కాబట్టి… ఏపీ ప్రయోజనాల కోసం అయితే.. వీరిద్దరు కచ్చితంగా… కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలి. ఒక వేళ.. రాష్ట్ర స్థాయిలో పోరాటం సాధ్యం కాదు అనుకుంటే.. జాతీయ స్థాయిలో మద్దతిస్తాం.. ఏపీలో పోరాడతామని అని ప్రకటించుకున్నా..సరిపోతుంది. కనీసం ఈ ప్రయత్నం అయినా చేస్తారా..?
పర్సనల్‌గా ప్రత్యేకహోదా కోరుకుంటున్నారా..?
ప్రత్యేకహోదా ఇస్తామంటున్న వారికి.. జగన్, పవన్ లు మద్దతివ్వకుండా.. ఇవ్వబోమని చెప్పి.. ఘోరంగా మోసం చేసిన వారిపై నమ్మకం పెట్టుకుంటే.. అంత కంటే… ఏపీ ప్రయోజనాలను దిగజార్చడం ఇంకేమీ ఉండదు. ప్రజలు జగన్, పవన్ లు తమకు ప్రత్యేకహోదా కోరుకుంటున్నారని… అందుకే… అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో.. అదీ కూడా.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమని తేల్చిన పార్టీతో అంట కాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు బీజేపీ… ఒక్క ప్రత్యేకహోదా విషయంలోనే కాదు.. ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీని నెరవేర్చలేదు. అయినా… పవన్ కల్యాణ్ ఒంటికి వెన్న పూసుకుని మర్యాదగా అడిగి తెచ్చుకోవాలని అంటారు. ఈయనే గతంలో ఒంటికి కారం పూసుకోని పోలేరా అన్నారు. జగన్.. అసలు… ఏ ఒక్క విభజన హామీ కానీ.. బీజేపీ గురించి కానీ..మోడీ గురించి కానీ నోరెత్తరు. అంటే.. మోడీ వైపేనా..?