మహిళా దినోత్సవం నాడు మహిళలపై దౌర్జన్యం! అక్రమ అరెస్టులు. గర్భిణులను కూడా లాక్కెళ్లిన పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పచ్చని గ్రామాల్లో బూట్ల చప్పుడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఇది. అక్కడ మెగా ఆక్వాఫుడ్ పార్క్ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీని వల్ల దాదాపు 33 గ్రామాల ప్రజల జీవనానికి ఇబ్బంది పొంచి ఉందనీ, పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు గుండె చించుకుని ఘోషిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా, ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే.. ఈ తరుణంలో రైతుల వెంట ఉంటాననీ, వారి వెనక నడుస్తా అంటూ గతంలో మాటిచ్చిన పవన్ కల్యాణ్ ఏమయ్యారూ అంటూ తుందుర్రు ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి, పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల సమస్య పవన్ కల్యాణ్ వద్దకు కొన్ని నెలల కిందట వెళ్లింది. తమ పొలాలు నాశనమైపోతున్నాయనీ, తమ బతుకులు ఫ్యాక్టరీ వల్ల బుగ్గిపాలు కాబోతున్నాయనీ, గ్రామాల్లోని మగాళ్లను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ కొంతమంది బాధితులు ఆ మధ్య పవన్‌ను ఆశ్రయించారు. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ హుటాహుటిన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ‘మీ వెంట నేనుంటా’ అంటూ హామీ ఇచ్చారు. ఇది దారుణం, దుర్మార్గం అంటూ తనదైన శైలిలో స్పందించారు. ఇప్పుడా గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలమంది పోలీసులు మోహరించి ప్రజలను అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో తుందుర్రు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వెంటా ఉంటానన్న పవన్ కల్యాణ్ ఎక్కడా అంటూ నిలదీస్తున్నారు.
నిజమే కదా… తుందుర్రులో ఇంత జరుగుతుంటే పవన్‌కల్యాణ్ ఎక్కడ..? కనీసం ట్విట్టర్లో కూడా దీని గురించి స్పందించలేదే..? ఇదేనా పోరాటం అంటే..? ఇదేనా ప్రశ్నించడం అంటే..? ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ప్రజాసమస్యలపై పోరాటం చేస్తారా..? ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన స్పందించలేరా..? లేదంటే.. పవన్ కల్యాణ్‌ను ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఏవైనా రాజకీయ శక్తులు ఒత్తిడి తెచ్చాయా..? తుందుర్రు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు ఇప్పుడు ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం ఏంటంటే… తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టును గతంలో చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించారు! ఎన్నికల ముందు పాదయాత్రలో ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడతా అని కూడా చెప్పారు. అయితే, ఇప్పుడాయన అధికారంలోకి వచ్చేశాక గతం మరచిపోయినట్టున్నారు. పైపెచ్చు.. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నవారంతా అభివృద్ధిని అడ్డుకుంటున్నవారంటూ చిత్రించడం మరో కోణం. తుందుర్రుల్లో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ ఇంతవరకూ స్పందించలేదు. అక్కడ చట్టం మాత్రమే తన పని తాను చేస్తోంది! మరి, పవన్ ఎక్కడున్నారో…?