జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పోటీ విషయంలో కొద్ది కొద్దిగారాజీ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీని తిరుపతిలో నిర్వహించి… గతంలో బీజేపీ ప్రకటించినట్లుగా … తిరుపతిలో జనసేననే పోటీ చేస్తుందని ప్రకటిస్తారని పార్టీ నేతలు ఎదురు చూశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల్లో అత్యదికం.. తిరుపతి నుంచి జనసేన పోటీ చేయాల్సిందేనని లేకపోతే.. భవిష్యత్‌లో తీవ్రమైన సమస్యలు వెంచాడుతాయని చెప్పారు. దీనిపై పవన్ కల్యాణ్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. బీజేపీ హైకమాండ్‌తో మాట్లాడి వారం రోజుల్లో క్లారిటీ తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ తిరుపతికి వచ్చిన సందర్భంగా… ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. జనసేన పార్టీకి ఉండే క్రేజ్ అది. ఏ నియోజవర్గానికి వెళ్లినా పెద్ద ఎత్తున జనం వస్తారు. కానీ భారతీయ జనతాపార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రజాకర్షక నేతలేరు. వారు వస్తారంటే.. ఆ పార్టీకి చెందిన నలుగురు ఐదుగురు నేతలు మాత్రమే వస్తారు. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన జనసేన తిరుపతి నేతలు కూడా.. భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఎలా మద్దతిస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ బీజేపీ నేతలు బాగా గౌరవం ఇస్తున్నప్పటికీ.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. జనసేననను నిర్వీర్యం చేసే వ్యూహాలు అమలు చేస్తున్నట్లుగా జనసేన పీఏసీ కమిటీలో చర్చలు జరిగాయి. దీనికి ఉదాహరణకు ఇటీవలి కాలంలో అనేక అంశాలను చర్చించారు. ఇదంతా మైండ్ గేమ్‌లో భాగమని.. వారు అనుమానిస్తున్నారు. ఢిల్లీ నేతలు గౌరవం ఇచ్చికూటమి నంచి బయటకు వెళ్లకుండా చేస్తారని.. రాష్ట్ర నేతలు.. పార్టీని నిర్వీర్యం చేస్తారని.. ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ అన్న అనుమానం ఆ పార్టీలో ప్రారంభమయింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం.. గుంభనంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పరిస్థితిని అంచనా వేయడానికి గతంలో కమిటీల్ని కూడా నియమించిన పవన్.. ఇప్పుడు.. అక్కడ జనసేన పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై స్పష్టమైన సూచనలు ఇవ్వడానికి సిద్ధం కాలేకపోతున్నారు. దీంతో జనసైనికులు ఊసూరుమంటున్నారు.