పంచాయతీ ఎన్నికల్లో మా బలం ఇదంటే ఇదని వైసీపీ, టీడీపీలో పోటాపోటీగా ప్రకటనలు చేసుకున్నాయి. వాదించుకున్నాయి. అయితే హఠాత్తుగా… జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీన్లోకి వచ్చారు. ప్రజల్లో మార్పు కనిపిస్తోందని… దానికి తమ పార్టీ మద్దతుదారులకు వచ్చిన ఓట్లు సీట్లే సాక్ష్యామని ఆయన మీడియాకు వివరించారు. గణనీయ సంఖ్యలో జనసేన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారని… కనీసం పదిహేడు వందల పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచారు.. ఈ లెక్కన చూస్తే.. తమకు పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతమే వచ్చాయి.
ఒక విడత పంచాయతీ ఎన్నికలే అయినప్పటికీ.. ఇదే సగటుు అంచనా వేస్తే… జనసేన బలం మూడింతలు పెరిగిందని ఆయన ఆనందంతో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రయారిటీ వేరు. గ్రామస్తులు తమకు అందుబాటులో ఉండేవారిని ఎంపిక చేసుకుంటారు. అక్కడ పార్టీలు పెద్దగా పని చేయవు. అయితే… క్యాడర్ స్ట్రెంత్ ని పంచాయతీ ఎన్నికలు నిరూపిస్తాయి. పవన్ కల్యామ్ చెప్పినట్లుగా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చి ఉంటే.. జనసేన పార్టీకి క్యాడర్ ఏర్పడినట్లే. ఇప్పటి వరకూ జనసేన .క్యాడర్ అంటే.. కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే. ఇప్పుడు … రాజకీయ క్యాడర్ వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. అయితే పవన్ కల్యాణ్ వారిలో స్ఫూర్తి నింపేలా రాజకీయం చేస్తున్నారా.. అన్నదే ఇప్పుడు సందేహం.
ఎందుకంటే… ఆయన రాజకీయంగా త్యాగాలు ఎక్కువ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందంూట ఆ పార్టీకే ఎక్కువ చాన్సులు ఇస్తున్నారు. చివరికి తిరుపతి లోక్‌సభలో తామే పోటీ చేస్తామని బీజేపీ చెబుతోంది. దానికి కూడా అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ బలం ఏమిటో పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయింది. మొదటి విడతలో మూడు అంటే మూడు పంచాయతీలు కూడా గెల్చుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో…బీజేపీ పోటీ చేస్తే ఎక్కువ ప్రభావం చూపించగలుగుతుందా… జనసేన పోటీ చేస్తే ఎక్కువ ప్రభావం చూపించగలుగుతుందా అన్నది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
జనసేన అధినేత.. రాజకీయ అడుగుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్న విషయం… మాటల్లోనే వ్యక్తమవుతోంది. మరి ఆయన బలోపేతమవుతున్నపార్టీని మరింత బలోపేతం చేస్తారా లేకపోతే… తన బలాన్ని .. అభిమాన బలగాన్ని బీజేపీకి మళ్లించి తాను బలహీనమవుతారా అన్నది ప్రధానమైన ప్రశ్న. దీనికి తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి ఎవరన్న దానితోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.